Oct 25,2023 21:33
  • మత్స్యకారుల బోట్లకు ట్రాకింగ్‌ వ్యవస్థ : సిఎస్‌

ప్రజాశక్తి-విశాఖపట్టణం : రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ మొబైల్‌ సేవల విస్తరణకు చర్యలు చేపట్టామని, ఇప్పటి వరకు గుర్తించిన అన్ని ప్రాంతాల్లోనూ స్థలాలను మంజూరు చేశామని, ఇతర సాంకేతిక ప్రక్రియలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. విశాఖపట్టణం విచ్చేసిన ఆయన బుధవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. తీర ప్రాంతంలో తీసుకుంటున్న భద్రతా పరమైన అంశాలు ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ పరిధిలో జరిగిన ఎఫెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చకు వచ్చాయని చీఫ్‌ సెక్రటరీ తెలిపారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే అన్ని రకాల బోట్లకు ట్రాకింగ్‌ సిస్టమ్‌ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 12 నాటికల్‌ మైళ్ల పరిధి దాటి మనవాళ్లు వెళ్లినా, ఇతరులు వచ్చినా ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపతామని తెలిపారు.

మార్చిలోగా సెల్‌టవర్ల ఏర్పాటు పూర్తి

ఏజెన్సీ ప్రాంతాల్లో టెలికాం సర్వీసుల విస్తరణకు తీసుకుంటున్న చర్యలను ప్రధాన మంత్రి ప్రగతి సమావేశంలో భాగంగా వివరించామని జవహర్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో 2,887 ప్రాంతాల్లో సెల్‌ టవర్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని, వాటిలో 2,840 స్థలాలను కేటాయించామని వివరించారు. 47 ప్రాంతాల్లో పెండింగ్‌ ఉందని తెలిపారు. 14 చోట్ల సంబంధిత కంపెనీ వాళ్లు దరఖాస్తులు సమర్పించలేదని స్పష్టం చేశారు. 13 చోట్ల రెవెన్యూ స్థలాలు, 20 చోట్ల ఫారెస్ట్‌ స్థలాల విషయంలో సాంకేతిక కారణాలు నెలకొన్నాయని తెలిపారు. 2024 మార్చిలోగా అన్ని రకాల పనులను పూర్తి చేయాలని, సెల్‌ టవర్లను ఏర్పాటు చేయాలని ప్రగతి సమావేశంలో కేంద్ర టెలికాం సెక్రటరీ సూచించారని, అందుకు అనుగుణంగా రాష్ట్రంలో చర్యలు వేగవంతం చేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, అదనపు డిజిపి ఆర్‌కె.మీనా, చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఎస్‌.శ్రీకాంత్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.