Sep 09,2023 07:59

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎంఎస్‌ఎంఇల ప్రోత్సాహానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, ముందుకు వచ్చేవారికి తగిన ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఎంఎస్‌ఎంఇలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే దిశగా యూనిట్లు ఏర్పాటు చేయాలని పరిశ్రమల అధికారులను ఆదేశించారు. కొప్పర్తి, గుంటూరులో ఏర్పాటవుతున్న ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ కేంద్రాల ప్రగతిని సిఎస్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్‌ఆర్‌ ఎపి వన్‌ ప్లాట్‌ఫాం, ఇండిస్టియల్‌ ఇనిఫ్రాస్ట్రక్చర్‌ తీసుకున్న చర్యలను, కామన్‌ ఫెసిలిటీ కేంద్రాలపైనా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ఎంఎస్‌ఎంఇ రంగంలో చేపట్టిన పలు అంశాలను వివరించారు. చేనేత జౌళిశాఖ ముఖ్యకార్యదర్శి సునీత, ఎంఎస్‌ఎంఇ సిఇఒ ప్రవీణ్‌కుమార్‌, జెడి రామలింగేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.

పిఎంవికె రెండున్నర లక్షల మందిని రిజిస్టర్‌ చేయాలి

చేతి వృత్తిదారులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో రాష్ట్రంలో మొదటి ఏడాదిగా రెండున్నర లక్షల మందిని రిజిస్టర్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సిఎస్‌ ఆదేశించారు. చేతి పనిముట్లతో సంప్రదాయ పద్ధతిలో చేతి వృత్తి చేసుకునే వారిని ఆదుకునేందుకు నూరుశాతం నిధులు సమకూర్చనుందని, రాష్ట్రం నుండి వీలైనంత మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులకు రూ.లక్ష రుణం ఇస్తారని, తీర్చిన తరువాత రూ.రెండు లక్షలు ఇస్తారని మొత్తం ఐదుశాతం వడ్డీతో హామీలేని రుణం ఇస్తారని పేర్కొన్నారు.