- బెంగాల్‌లో గిగ్ కార్మికుల వెతలు
- ఉద్యమ బలోపేతంపై చర్చలు
కోల్‌కతా : ఎలాంటి ప్రయోజనాలు లేకుండా గంటల తరబడి పని చేయాల్సి వస్తోందని, పైగా గుర్తింపు కూడా వుండడం లేదని గిగ్, అసంఘటిత రంగ కార్మికులు వాపోతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టాల్సిన కార్యచరణపై, పశ్చిమ బెంగాల్‌లో తమ ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడానికి గల మార్గాలపై చర్చించేందుకు ఇక్కడ కృష్ణపాద మెమోరియల్ హాల్‌లో వందలాదిమంది కార్మికులు సమావేశమయ్యారు. భారత నిర్మాణ కార్మికుల సమాఖ్య (సిడబ్లుఎఫ్‌ఐ) నేత దేవాంజన్ చక్రవర్తి ఈ సదస్సుకు అధ్యక్షత వహించగా, ఆఖిల భారత గిగ్ వర్కర్స్ యూనియన్ కోల్‌కతా జిల్లా కార్యదర్శి సాగ్నిక్ సేన్‌గుప్తా సదస్సుకు ప్రతిపాదనలు సమర్పించారు. సిఐటియు కోల్‌కతా జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి దేవాశిష్ రారు, అఖిల భారత గిగ్ వర్కర్స్ యూనేఇయన్ నేత సురాజిత్ ఘోష్‌లతో సహా పలువురు వక్తలు ఈ సదస్సులో ప్రసంగించారు.
సంఘటిత రంగంలో పనిచేసే వారిలా ఈ రంగంలో పనిచేసేవారికి ఎలాంటి నియమాక పత్రాలు వుండవు, పైగా ఇఎస్‌ఐ, పెన్షన్ వంటి సదుపాయాలు వుండవు, రోజులో సుదీర్ఘకాలం పనిచేసినా తమ కనీస అవసరాలు తీరేలా సంపాదన వుండడం లేదని వారు వాపోతున్నారు. సిఐటియు అనుబంధ సంస్థ అయిన గిగ్ అండ్ ఇన్‌ఫార్మల్ సెక్టార్ వర్కర్స్ యూనియన్ సభ్యుడైన బెరా మాట్లాడుతూ సమాజంలో నిలదొక్కుకునేందుకు పోరాడుతున్నామని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ఎలాంటి అవకాశాలు వుండడం లేదని అన్నారు. సైట్ సూపర్‌వైజర్‌గా నెలకు కేవలం రూ.12వేలతో సంసారాన్ని పోషించడం కష్టంగా వుందన్నారు.
ఇక స్విగ్గీలో డెలివరీ బారుగా పనిచేసే ప్రశాంత్ ఘోష్ మాట్లాడుతూ 8గంటల్లో 14 డెలివరీల వరకు ఇవ్వాల్సి వుంటుందని, కానీ వాస్తవానికి వాటికే 12 నుండి 14 గంటలు పడుతుందని, ఇంత చేసి సంపాదించేంది కేవలం రూ.550 అని అన్నారు. డెలివరీ బారు బదులుగా వీరిని డెలివరీ పార్టనర్స్‌గా గుర్తించాలని కోరుతున్నారు. ప్రమాద బీమా వుండదని, ఏదైనా జరిగినా కంపెనీ పట్టించుకోదని అన్నారు. పోలీసుల వేధింపులు కూడా తప్పవని అన్నారు. యాప్ ప్రాతిపదిక గల డెలివరీ పార్టనర్స్‌గానే కంపెనీలు వీరిని చూస్తున్నాయని సిఐటియు నేత దేవాశిష్ రారు అన్నారు. ఈ రంగానికి సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వం కొన్ని సానుకూల చర్యలు తీసుకుంది కానీ బెంగాల్ ప్రభుత్వంతో సహా మరే ఇతర రాష్ట్రాలు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. యాప్ ప్రాతిపదికన పనిచేసే వారందరికీ సంబంధించి ఒక బిల్లును తీసుకురావాలనుకుంటున్నట్లు ఇటీవల బెంగాల్ ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు.
అయితే మొత్తంగా కార్మికుల దోపిడీని పరిష్కరించేందుకు ఏ ప్రభుత్వమూ చర్యలు తీసుకోవడం లేదని రారు విమర్శించారు. ఈ రంగాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన కార్మికులందరినీ కలుపుకుని మరింత విస్తృతమైన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.










