- బోధనేతర పనులకు మినహాయింపు అంటూ జీఓ జారీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని టీచర్లను బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ మంగళవారంనాడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో నిర్బంధ విద్యాహక్కు చట్టంలోని కొన్ని నిబంధనలు సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇకపై టీచర్లు విద్యా బోధనపైనే దష్టిసారించాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీచర్ల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. వర్చువల్ క్యాబినెట్ ద్వారా ఈ సవరణకు రాష్ట్రప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. బోధనేతర విధులనుంచి మినహాయింపు పేరిట ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తొలగించడమే ప్రభుత్వ అసలు లక్ష్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పిఆర్‌సి, సిపిఎస్ లాంటి కీలకాంశాల్లో ప్రభుత్వం టీచర్ల డిమాండ్‌లను నెరవేర్చకపోగా ఫేషియల్ అటెండెన్స్ వంటి కొత్త విధానాన్ని రుద్దుతోంది. టీచర్లపై పోలీసుల నిర్బంధం కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులపై పెరిగింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో వుంటే ప్రభుత్వానికి ప్రతికూల ప్రభావముంటుందని అధికారపార్టీ అంచనా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బావిస్తున్నారు. దేశవ్యాప్తంగా జనగణన, ఎన్నికల విధుల్లో ఉపాద్యాయులు పనిచేయడం సర్వసాధారణమే అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయులను ఉద్ధేశపూర్వకంగా ఎన్నికల విధులకు దూరం చేసేందుకు ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.










