Nov 03,2022 21:46

డిగ్రీ, ఆపై చదివిన వారి నుంచి వివరాల సేకరణ
ఎంప్లాయిమెంట్‌ సర్వే పేరుతో ఇంటింటా సర్వే
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి :
గ్రామ/వార్డు వలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను అపహాస్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ కొత్త ఎత్తుగడ వేసింది. ఎంప్లాయిమెంట్‌ సర్వే పేరుతో ఇంటింటికీ వెళ్లి డిగ్రీ, ఆపై చదివిన వారి వివరాలు సర్వే చేయాలని వారిని పురమాయించింది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని ఫీల్డ్‌ ఆపరేట్‌ వింగ్‌ (ఎఫ్‌ఒవి)ని రంగంలోకి దించింది. రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, మూడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలోని ఒక పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని తూర్పు రాయలసీమలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలోని ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటికి ఈ నెల ఏడో తేదీ వరకు ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్‌ గడువు విధించింది. ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం నుంచీ అధికార వైసిపి అడ్డదారులకు తెరతీసింది. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించి గ్రామ/వార్డు వలంటీర్లతో ఓటరు నమోదు దరఖాస్తు, ఇతర ధ్రువపత్రాలను సేకరించడం మొదలుపెట్టింది. దీనిపై అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో రూపంలో వారిని ఎన్నికల విధుల్లోకి దించినట్లు సమాచారం. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వివరాల సేకరణకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని ఫీల్డ్‌ ఆపరేట్‌ వింగ్‌ (ఎఫ్‌ఒవి) అనే ఏజెన్సీని ప్రభుత్వం వినియోగిస్తున్నట్లు తెలిసింది. సిఎంఒ కార్యాలయం నుంచే నేరుగా దీన్ని ఆపరేట్‌ చేస్తున్నట్లు సమాచారం. సర్వేలో ఉద్యోగుల పాత్ర లేకుండా గ్రామ/వార్డు వలంటీర్లను మాత్రమే భాగస్వామ్యం చేసింది. ఎన్నికల కమిషన్‌ నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇందుకు సంబంధించి జిల్లా అధికారులకు ఎటువంటి సర్క్యులర్లనూ జారీ చేయలేదు. దీంతో, సర్వే జరుగుతున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ జిల్లా నోడల్‌ అధికారులకు సైతం తెలియడం లేదు.
ఓటరుగా నమోదయ్యారా?
గ్రామ/వార్డు వలంటీర్లకు అప్పగించిన సర్వేలో పలు అంశాలతోపాటు సర్వేపై మొబైల్‌ ఫోన్ల ద్వారా కొంత శిక్షణ కూడా ఇచ్చారు. గ్రామంలో చదువుకున్న వాళ్లు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది డిగ్రీ పూర్తి చేశారు? ఎమ్మెల్సీ ఓటుకు రిజిస్ట్రేషన్‌ చేశారా? వంటి ప్రశ్నలతో సర్వే ఏ కుటుంబాలకు చేయాలో నిర్దేశించారు. తొలుత డిగ్రీ, ఇంకాపై చదివిన వాళ్లకు చేయాలని వింగ్‌ ఆపరేట్‌ చేస్తున్న అధికారులు సూచించారు. ఈ రకమైన వివరాలు సేకరించడంతోనే ఈ సర్వే అసలు ఉద్దేశమేమిటో తేటతెల్లమవుతోంది. యాప్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత వారి సెల్‌కు ఒన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఒటిపి) వస్తుంది. ఓటరు ఫోన్‌ నంబరు సేకరించడంతో ఎన్నికల ప్రచార సమయంలో ప్రచారానికి వినియోగించుకునే అవకాశాలూ లేకపోలేదని చర్చ సాగుతోంది. దీనిపై ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించాల్సి ఉంది.