Sep 12,2023 21:00

ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా) : విఆర్‌ఎలకు పే స్కేలు ఇవ్వాలని, 2018 జూన్‌ నుండి డిఎను అమలు చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం బాలకాశి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళగిరి సిఐటియు కార్యాలయంలో మంగళవారం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017లో విజయవాడ ధర్నా చౌక్‌లో విఆర్‌ఎల ధర్నాలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి హాజరై విఆర్‌ఎల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. జగన్‌ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు దాటినా విఆర్‌ఎల హామీలు అమలుకు నోచుకోలేదని తెలిపారు. గతేడాది డిఎ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి రికవరీ చేసి విఆర్‌ఎలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని అన్నారు. కేవలం రూ.10,500 వేతనంతో పనిచేస్తున్నారని అన్నారు. విఆర్‌ఎలు అందరూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. డిఎ అమలు చేయాలని, ప్రమోషన్స్‌ ఇవ్వాలని కోరారు. నామినీలను విఆర్‌ఎలుగా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కమిటీ అధ్యక్షులు ఎన్‌ పెద్దన్న, ఉపాధ్యక్షులు భద్రరావు, బి వెంకట రత్నం, అంజి, శ్రీనాథ్‌, సూర్యనారాయణ, యాకోబు, బి రవి తదితరులు పాల్గొన్నారు.