- రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద విఆర్‌ఎల ఆందోళనలు, నిరసన దీక్షలు
ప్రజాశక్తి-యంత్రాంగం : తెలంగాణలో మాదిరిగా విఆర్‌ఎలకు పేస్కేల్ అమలు చేయాలని, అర్హత ఉన్న విఆర్‌ఎలకు విఆర్‌ఒలుగా ప్రమోషన్ ఇవ్వాలని, నామినీలుగా పని చేస్తున్న విఆర్‌ఎలను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా విఆర్‌ఎలు రెండు రోజులపాటు నిరసన దీక్షలకు దిగారు. ఎపి గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం ఆధ్వర్యంలో ఈ దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విఆర్‌ఎల పట్ల నిర్లక్ష్య వైఖరి అలంబించకుండా గత ఎన్నికల సందర్భంగా వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విఆర్‌ఎలు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీల్లో భాగంగా విఆర్‌ఎలకు ప్రమోషన్లు కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, డిఎను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో కలెక్టరేట్ ఆవరణలో నిరసన దీక్షలు చేపట్టిన విఆర్‌ఎలకు టెంట్ వేసుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో సమీపంలోనే మొక్కల మధ్య విఆర్‌ఎలు కూర్చుని నిరసన దీక్షలు ప్రారంభించారు. ఏలూరులో సామూహిక నిరాహార దీక్షలు ప్రారంభించారు. కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కడప, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద విఆర్‌ఎలు బైఠాయించి ఆందోళన చేశారు. అనకాపల్లి కలెక్టరేట్, విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం, పాడేరులోని ఐటిడిఎ కార్యాలయం వద్ద ధర్నాలు చేసి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.










