ఎన్‌పిఆర్‌డి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం మురళీధరన్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ : వికలాంగుల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని ఎన్‌పిఆర్‌డి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.మురళీధరన్ పేర్కొన్నారు. ఆదివారం నాడిక్కడ హరికిషన్‌సింగ్ సుర్జీత్ భవన్‌లో ఎన్‌పిఆర్‌డి కేంద్ర కమిటీ సమావేశం సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నంబురాజన్ అధ్యక్షతన జరిగింది. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమాలు ఉధృతం చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా ఎం.మురళీధరన్ మాట్లాడుతూ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో వికలాంగుల వివరాలు సేకరించకూడదని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం సరైంది కాదని చెప్పారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్ విత్ డిజేబులిటీ 2021- 22 వార్షిక నివేదిక ప్రకారం 67,09,894 మందికి యుడిఐడి కార్డులు జారీ చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా 1,74,25,094 మందికి వైకల్య ధ్రువీకరణ పత్రాలు ఇస్తే అందరికీ ఎందుకు యుడిఐడి కార్డు జారీ చేయలేదని ప్రశ్నించారు. పాఠశాలలకు వెళుతున్న వైకల్యం కలిగిన విద్యార్థులను గుర్తించేందుకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి సర్వే చేయాలని 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 17(ఎ) పేర్కొందని, దేశంలో ఎక్కడా ఇటువంటి సర్వేలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వికలాంగుల కోసం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించిందని గుర్తు చేశారు. వికలాంగులను స్థానిక సంస్థలకు నామినేట్ చేసే విధంగా కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని డిమాండ్ చేశారు. రైల్వేల్లో రాయితీ పాసులుసహా వికలాంగుల కోసం ఉన్న అనేక సంక్షేమ పథకాలను, చట్టాలను కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో ప్రతి వికలాంగునికి జాబ్ కార్డు జారీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించాలని డిమాండ్ చేశారు. వికలాంగులందరికీ అంత్యోదయ రేషన్ కార్డులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.










