విశాఖ (కలెక్టరేట్) : దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 26 నుండి జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ సంఘాల కార్యాచరణ సమాఖ్య వేదిక (జెఎసి) ఆధ్వర్యంలో నిరాహార దీక్షలను చేపట్టనున్నట్లు దివ్యాంగుల మహాసేన జాతీయ అధ్యక్షుడు బొడ్డేపల్లి రఘు తెలిపారు. గురువారం విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో అశ్రద్ధ వహిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా పార్లమెంటు ఆమోదించిన 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకూ అమలు చేయకపోవడంతో దివ్యాంగులకు ఎంతో నష్టం కలిగిందన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో దివ్యాంగుల పట్ల వివక్ష చూపుతోందని విమర్శించారు. 4 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని, 25 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఒక్కొక్క దివ్యాంగునికి హామీ లేకుండా రూ.10 లక్షలు రుణంగా ఇవ్వాలని, అందులో రూ.5 లక్షలు సబ్సిడీ గాను, మరో రూ.5 లక్షలు బ్యాంకు రుణంగానూ ఇవ్వాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన దివ్యాంగులకు ఇళ్లను కేటాయించాలని కోరారు. సమావేశంలో దివ్యాంగుల మహాసేన జాతీయ కార్యదర్శి ఎస్.రామన్ సుబ్బారావు, రాష్ట్ర అధ్యక్షుడు వి.రామస్వామి, డాక్టర్ సీతల్ మదన్, డాక్టర్ అవినాష్, హెలెన్ కిల్లర్, భీమారావ్ తదితరులు పాల్గొన్నారు.










