వికలాంగుల ఉద్యోగాల భర్తీ.. వికలాంగుల, లింగ మార్పిడి, వయోవృద్ధుల శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా..
అమరావతి బ్యూరో: వికలాంగుల కోసం రిజర్వ్ చేయబడి, ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలనూ ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నామని విభిన్న ప్రతిభావంతులు, లింగ మార్పిడి, వయోవృద్ధుల శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం నిర్ణీత కాలవ్యవధితో కూడిన షెడ్యూల్‌ను సిద్ధం చేశామని, ఈ నెల 25వ తేదీలోపు వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టులను గుర్తించి, జనవరి 7 నాటికి నియామక ప్రకటన విడుదల చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. జనవరి 31 కల్లా నియామకాలు పూర్తి చేస్తామని, సిఎం ఆదేశాల మేరకే ఈ ప్రత్యేక నియామక ప్రక్రియను చేపట్టామని స్పష్టం చేశారు. ఆయా విభాగాలకు సంబంధించిన ఉపసంచాలకులు అందరికీ నియామక విషయంలో చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. వికలాంగులు, వయోవృద్ధుల కార్పొరేషన్ పరిధిలోని విభిన్న ఉపకరణాలను సైతం జనవరి 31లోపు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలోని సహాయ సంచాలకులు, మేనేజర్ల వద్ద వికలాంగులకు ఉపకరించే 2,667 ఉపకరణాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిలో 231 మూడు చక్రాల సైకిళ్లు, 174 చక్రాల కుర్చీలు, 419 ఊతకర్రలు, 156 టచ్ ఫోన్లు, 1527 వినికిడి సాధనాలు, మరో 160 ఇతర ఉపకరణాలు పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కార్పొరేషన్‌కు చేరిన దరఖాస్తులను పరిశీలించి, అర్హుల జాబితా తయారు చేసి, కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశాలిచ్చామని ఆమె తెలిపారు.










