Dec 26,2022 11:05

కాబూల్‌ : మహిళల విద్య, ఉద్యోగాలకు సంబంధించి తాజాగా తాలిబన్లు ఆంక్షలు పెట్టడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు మూడు ఎన్‌జిఒ సంస్థలు ఆదివారం ప్రకటించాయి. అంతర్జాతీయ, స్థానిక ప్రభుత్వేతర సంస్థల్లో మహిళలు పనిచేయకుండా నిషేధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. సేవ్‌ ది చిల్డ్రన్‌, నార్వేజియన్‌ రెఫ్యూజీ కౌన్సిల్‌, కేర్‌ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలు తమ సంస్థల్లో పనిచేయకుండా పిల్లలు, మహిళలకు సేవలందించలేమని తెలిపారు. ''అంకితభావంతో కూడిన మహిళా సిబ్బంది లేకుండా మేము పని చేయలేం, లక్షల మంది ప్రాణాలను కాపాడటానికి, సేవలందించేందుకు మహిళలను యాక్సెస్‌ చేయడానికి మాకు చాలా అవసరం,'' నీల్‌ టర్నర్‌, ఆఫ్ఘనిస్తాన్‌ కోసం నార్వేజియన్‌ రెఫ్యూజీ కౌన్సిల్‌ చీఫ్‌, ఆదివారం అసోసియేటెడ్‌ ప్రెస్‌తో అన్నారు. ఈ గ్రూపులో దేశంలో 468 మంది మహిళా సిబ్బంది ఉన్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మానవతా కార్యకలాపాలకు మహిళలు కేంద్రంగా ఉన్నారని, వారిని సేవల నుంచి తప్పించడం సరికాదని అమెరికా దేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ శనివారం అన్నారు.