ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సివిల్ సర్వీసులో ఉండే అధికారులు తప్పనిసరిగా రూల్‌బుక్‌ను పాటించాలని, రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఉల్లంఘనలకు పాల్పడితే తగిన ఫలితం అనుభవించాల్సి ఉంటుందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ సంస్థ సభ్యులు హెచ్చరించారు. దేశంలో అనేక రంగాల్లో అభివృద్ధి సాధించినా సమాజంలో అంతరాలు, వివక్ష తొలగిపోలేదని, సంపద సృష్టి జరిగినా పంపిణీలో అసమానతల వల్ల ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ భవానీ ప్రసాద్ మాట్లాడారు. తొలితరం ప్రజాప్రతినిధుల ఆదర్శాలతో ప్రజాస్వామ్య ప్రయాణం మొదలైందని తెలిపారు. పాలనా వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడం, అవినీతి, ఎన్నికల వ్యవస్థలో లోపాల వల్ల వారి ఆదర్శాలు, ఆకాంక్షలు నెరవడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో పాలనా వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత, నిస్పాక్షిక ఎన్నికలు జరగడం ముఖ్యమని తెలిపారు. ఎన్నికల నియమావళిపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఉపాధి కోసం వలసవెళ్లే వారిపట్ల ఎన్నికల సిబ్బంది మానవత్వంతో వ్యవహరించాలన్నారు. వలస కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఒక పద్ధతిని ఏర్పాటు చేయాలని చెప్పారు. తమ సంస్థ కార్యవర్గ సమావేశం అనంతరం భవిష్యత్ కార్యకలాపాలు, జిల్లాల్లో క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలను నిర్ణయిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గనేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అందరూ జవాబుదారీతనంలో పనిచేస్తేనే వ్యవస్థలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సంస్థ సహాయ కార్యదర్శి వి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. అక్టోబరు ఒకటోతేదీన విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగే సదస్సులో భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి విఎస్ సంపత్ మాట్లాడుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి ఫల్గుణకుమార్, మాజీ డిజిపి ఎంవి కృష్ణారావు, విజయవాడ పూర్వ మేయర్ జంధ్యాల శంకర్, విద్యావేత్త ఎంసి దాస్, సీనియర్ పాత్రికేయుడు సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు.










