Oct 31,2023 07:57

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఒపిఎస్‌)ను తీసుకురావాలని కోరుతూ.. నవంబరు 3న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో లక్ష మందితో చలో ఢిల్లీ, ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కెవి శివారెడ్డి, ఎపి పిటిడి నేషనల్‌ మజ్దూర్‌ యూనిట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని గాంధీనగర్‌ ఎపి ఎన్‌జిఒ భవనంలో సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. కావలిలో ఆర్‌టిసి డ్రైవరు బిఆర్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులందరినీ అరెస్టు చేయాలని, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని తక్షణమే అరెస్టు చేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అరియర్స్‌, పండగ అడ్వాన్స్‌లు, సరెండర్‌ లీవు బిల్లులు సెప్టెంబరులోగా చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొందని, తక్షణమే ఆయా చెల్లింపులు జరిగేలా సిఎం చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశానికి ముందు విజయవాడ విద్యాధరపురంలో చికిత్స పొందుతున్న డ్రైవరు రామ్‌సింగ్‌ను ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, ఎపి ఎన్‌జిఒ అధ్యక్ష, కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కెవి శివారెడ్డి, ఎన్‌ఎంయు రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి పరామర్శించారు.