Oct 25,2023 11:58
  • 27న రాహుల్‌గాంధీ సమక్షంలో చేరిక
  • బిజెపికి రాజీనామా

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణలో బిజెపికి షాక్‌ తగిలింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 'రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కెసిఆర్‌ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలి. నా ఆశయం ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్‌ను భావిస్తున్నారు. నేను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదు. తెలంగాణ ప్రయోజనాల కోసమే తపన పడ్డాను. ఈనెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. 100 మంది బిఆర్‌ఎస్‌ నేతలు ఎంతో కష్టపడితే మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ గెలిచింది. ప్రస్తుతం బిజెపి నాయకత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల కారణంగా ప్రజల్లో నమ్మకం పోయింది. బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒక్కటేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎల్బీనగర్‌ లేదా మునుగోడు టికెట్‌ ఇచ్చేందుకు బిజెపి సిద్ధపడింది. కానీ, ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్‌లో చేరుతున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌లో ఉంటేనే మీరు గెలుస్తారని ప్రజలు నాతో చెప్పారు. మళ్లీ మునుగోడు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా' అని వెల్లడించారు.