- కోవింద్‌తో అప్పట్లోనే
- అమిత్ షా, పికె మిశ్రా భేటీ
- కేంద్ర పెద్దల దిశానిర్దేశంతో రామ్‌నాథ్ సంప్రదింపులు
ముంబయి : జూన్ 2...కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరిగిన నాలుగు రోజులకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాసానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకరు కేంద్ర హౌం మంత్రి అమిత్ షా కాగా మరొకరు ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ కార్యదర్శి డా||పి.కె.మిశ్రా.
ప్రస్తుతం బాగా చర్చ జరుగుతున్న అంశమైన 'ఒక దేశం, ఒక ఎన్నిక' పథకానికి కోవింద్ ఆధ్వర్యంలో కసరత్తు ప్రారంభించేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు ఈ పరిణామం గురించి తెలిసిన వర్గాలు పేర్కొన్నాయి. కర్ణాటక ఎన్నికల్లో బిజెపి పరాజయం పాలైన వెంటనే ఈ కసరత్తు ప్రారంభమైంది. నిజానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు పార్టీని బాగా దెబ్బతీశాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చే సీట్ల గురించి ఆందోళన పెరిగేలా చేశాయి. దాంతో ఒకేసారి ఎన్నికల నిర్వహణ అనే అంశం తెరపైకి వచ్చింది.
అయితే కోవింద్‌ను ఎందుకు ఎంచుకున్నారు ?
మాజీ రాష్ట్రపతి అయిన రామ్‌నాథ్ కోవింద్ పెద్దగా ప్రజా సంబంధాలు కలిగిన వ్యక్తి కాదు, కానీ జఠిలమైన చట్టసంబంధమైన అంశాలను నిర్వహించ గలిగే సామర్ధ్యం వుంది. మోడీకి ఆయన అంటే గురి, విశ్వాసం వుంది. ''2024 ఎన్నికలకు ముందుగా ప్రతిపక్షాలు సంఘటితం కావడాన్ని దెబ్బ తీయడానికి గానూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు భూమికను సిద్ధం చేయాల్సిందిగా మోడీ విశ్వసనీయులైన తన పార్టీ కార్యకర్తలను కోరారు.'' అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
''ఒక దేశం, ఒక ఎన్నిక'' కమిటీకి అధినేతగా కోవింద్ పేరును శుక్రవారం లాంఛనంగా ప్రకటించారు. ఆ మరుసటి రోజు కమిటీలోని సభ్యులు పేర్లను ప్రకటించారు. ప్యానెల్ సన్నాహక కార్యకలాపాల కోసం ఆదివారం, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు కోవింద్‌ను కలిశారు. అయితే, మాజీ రాష్ట్రపతి కోవింద్ ఈ సన్నాహక కార్యకలాపాలను జూన్ 2 నుండే ప్రారంభించినట్లు కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో ఆయన టైమ్‌లైన్‌ను ఒక్కసారి చూసినట్లైతే ఇందుకోసం ఆయన అవసరమైన సన్నాహాలను ఎలా చేశారనేది తెలుస్తుంది. గత మూడు మాసాల్లో ఆయన 10 మంది గవర్నర్లతో భేటీ అయ్యారు. రిటైరైన రాష్ట్రపతులకు బిజీగా వుండే షెడ్యూల్ వుండదు. సాధారణంగా వారు తమ చివరి కాలాన్ని ఆస్వాదిస్తూ గడుపుతారు.
లేదా తమ జ్ఞాపకాల దొంతరలను పేరుస్తూ ఒకటి రెండు పుస్తకాలు రచిస్తారు. కానీ, దీనికి విరుద్ధంగా కోవింద్ రాజ్‌భవన్‌ల చుట్టూ ప్రయాణించడం ఆరంభించారు. గవర్నర్లను, పార్టీ నేతలను కలుసుకోవడం వారితో చర్చించడం మొదలుపెట్టారు.
జూన్ 9 నుండి ఆగస్టు 29 మధ్య కాలంలో, కోవింద్ కనీసం 10మంది గవర్నర్లు లేదా అడ్మినిస్ట్రేటర్లతో సమావేశమయ్యారు. వారిలో కొంతమందితో ఒకటి కన్నా ఎక్కువసార్లే భేటీ అయ్యారు. దీనికి తోడు, సీనియర్ పార్టీ నేతలను, ఆర్‌ఎస్‌ఎస్ అధినేతను కూడా కలిసి చర్చలు జరిపారు. ప్యానెల్ నియామకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఒకేసారి ఎన్నికల నిర్వహణకు తన ప్రతిపాదనలను పటిష్టం చేసే పనిని కమిటీ ఇప్పటికే ప్రారంభించింది. సెప్టెంబరు 18 నుండి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ కమిటీ నివేదికను ప్రవేశపెట్టనున్నారు.
2025 దరిదాపుల్లో పదవీ కాలాలు ముగుస్తున్న అసెంబ్లీల (మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటివి)ను రద్దు చేయాలన్నది ఈ ముసాయిదా వెనుక గల ఆలోచనగా వుంది. మరోపక్క ఇటీవలే ఎన్నికలు జరుపుకున్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం ఒక ఏడాది పొడిగించబడుతుంది. తద్వారా వచ్చే సైకిల్‌లో అంటే 2029లో అక్కడ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు.
కోవింద్ 'జమిలి' పర్యటనలు, భేటీలు
జూన్ 9 : పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేతయతో పంజాబ్‌లో భేటీ
జూన్ 10 : మురళీ మనోహర్ జోషితో భేటీ
జూన్ 23 : యుపి గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌లను లక్నోలో కలిసిన కోవింద్
జూన్ 26 : కోవింద్‌తో కేంద్ర మంత్రి భూపేందర్ భేటీ
జులై 7 : దాద్రా నాగర్ హవేలి అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కె.పటేల్‌ను కలిసిన కోవింద్
జులై 16 : కోవింద్‌తో యుపి నేత కేశవ్ ప్రసాద్ మౌర్య భేటీ
జులై 17 : ఒడిషా గవర్నర్ గణేషి లాల్, బీహార్ గవర్నర్ రాజేంద్ర అకలేకర్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సివి ఆనంద బోస్‌లతో రామ్‌నాథ్ సమావేశం
జులై 19 : భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌తో కోవింద్ సమావేశమయ్యారు.
జులై 23 : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మర్యాదపూర్వకంగా రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు.
ఆగస్టు 1 : అమిత్ షా, కోవింద్ సమావేశం
ఆగస్టు 5 : కోల్‌కతాలో ఆనంద బోస్‌తో భేటీ
ఆగస్టు 10 : కోవింద్‌తో ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ సమావేశమయ్యారు.
ఆగస్టు 11 : కోవింద్‌తో గుజరాత్ గవర్నర్ దేవ్‌రత్ మర్యాదపూర్వక భేటీ
ఆగస్టు 19 : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ భేటీ
ఆగస్టు 25 : ఆనందిబెన్ పటేల్‌తో మరోసారి కోవింద్ భేటీ
ఆగస్టు 29 : ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో కోవింద్ సమావేశం.










