భువనేశ్వర్ : 'వన్ నేషన్ వన్ ఎలక్షన్'పై కేంద్రం నియమించిన కమిటీ తొలిసారిగా ఈ నెల 23న సమావేశం కాబోతున్నట్లు ఆ కమిటీకి నాయకత్వం వహిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు భువనేశ్వర్ వచ్చిన ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై వీలైనంత త్వరగా పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీకి రామ్‌నాథ్ కోవింద్ నేతత్వం వహిస్తుండగా.. కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, గులాంనబీ ఆజాద్, ఆర్థిక సంఘం చైర్మన్ ఎస్‌కె సింగ్, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజరు కొఠారీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సమావేశాలకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక ఆహ్వానితుడు కాగా.. న్యాయ వ్యవహారాల కార్యదర్శి నితేన్ చంద్ర ప్యానెల్‌కి కార్యదర్శిగా వ్యవహరిస్తారు. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో సవరణలు, ప్రజాప్రాతినిధ్య చట్టం మొదలైన అంశాలపై సవరణలు, ఏదైనా ఇతర చట్టాలు, నియమాలను పరిశీలించి కమిటీ సిఫారసులు చేస్తుంది. ఈ నెల 18-22 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఆ తరువాత రోజు ఈ కమిటీ సమావేశం కావడం గమనార్హం. అధికారాన్ని కేంద్రీకృతం చేసుకుని, నిరంకుశ విధానాలను అమలు చేసేందుకే జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.










