- ఆన్‌లైన్‌కు బదులుగా ఆఫ్‌లైన్‌లో పంపిణీ
- రైతు కాకుండా అధికారి అథంటికేషన్
- రాయితీ సొమ్ము కొందరి జేబుల్లోకి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పెద్ద ఎత్తున పక్కదారి పట్టినట్లు ఆరోపణలొస్తున్నాయి. రైతుల్లో వేరుశనగ సాగుపై నెలకొన్న అనాసక్తిని తమకు అనుకూలంగా మార్చుకున్న 'కొందరు' పంపిణీలో నిబంధనల మార్పు మాటున అక్రమాలకు పాల్పడ్డట్లు విమర్శలొస్తున్నాయి. ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో, లబ్ధి పొందే రైతు కాకుండా మండల వ్యవసాయాధికారుల అథంటికేషన్‌తో విత్తనాలను వేరే మార్గాలకు మళ్లించినట్లు సమాచారం. ఇటువంటి అక్రమాలు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఎక్కువగా చోటు చేసుకున్నాయని, తతిమ్మా రాయలసీమ జిల్లాల్లోనూ అక్కడక్కడ జరిగాయని వ్యవసాయశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
డి-క్రిషి పక్కకి
రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో డి-క్రిషి యాప్‌లో రైతుల నమోదు ద్వారా రాయితీ విత్తనాల పంపిణీ గతేడాది నుండి పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. యాప్‌లో రైతులు తమ పేరు మీద సాగు చేసే భూమిలో ఎంత విస్తీర్ణానికి ఎంత పరిమాణంలో విత్తనాలొస్తాయో అన్నింటిని, ముందుగానే నాన్-సబ్సిడీ అమౌంట్‌ను చెల్లించి బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న కొన్ని రోజులకు రైతులకు విత్తనాలు అందజేస్తారు. ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాల్లో నాణ్యతలేమి, బహిరంగ మార్కెట్లోనే ధర తక్కువ కావడం, వేరుశనగ సేద్యంపై అనాసక్తి కారణాలతో రైతులు సబ్సిడీ విత్తనాల జోలికి అంతగా వెళ్లలేదు. ఆన్లైన్లో అయితే సబ్సిడీ విత్తనాలను స్వాహా చేయడం ఇబ్బందికరం అయినందున, ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో విత్తనాల పంపిణీ చేపట్టారని సమాచారం. రికార్డుల్లో ఎవరెవరివో రైతుల పేర్లు రాసి విత్తనాలను పక్కదారి పట్టించి 'కొందరు' జేబులు నింపుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
ధ్రువీకరణ మతలబు
గతంలో లబ్ధిదారుడైన రైతు ఆర్‌బికెకు వచ్చి ఆన్లైన్ యాప్‌లో వేలి ముద్రలు తప్పనిసరిగా వేయాలి. ఇప్పుడు ఆ నిబంధనను సడలించినట్లు చెబుతున్నారు. రైతు నేరుగా రాకపోయినా వ్యవసాయాధికారి అథంటికేషన్‌తో రాయితీ విత్తనాల పంపిణీ చేస్తున్నారని సమాచారం. తప్పుడు రికార్డులు సృష్టించి లారీలకు లారీల విత్తనాలు అక్రమ మార్గాలకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. ఖరీఫ్‌లో సబ్సిడీపై మొత్తంగా 3.3 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాలనుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు 2 లక్షల క్వింటాళ్ల ఇండెంట్ ఇచ్చారు. వేరుశనగ సాగు అంతంతమాత్రంగానే సాగింది. విత్తిన చోట్ల రాయితీ విత్తనాలు చాలా తక్కువ. రైతులు పెద్దగా ఆర్‌బికెలకు వెళ్లింది లేదు. రికార్డుల్లో మాత్రం దాదాపు 1.8 లక్షల క్వింటాళ్ల పంపిణీ జులై నెలాఖరుకు పూర్తయినట్లు చెబుతున్నారు. కొందరైతే నూటికి నూరు శాతం పంపిణీ చేసేశామంటున్నారు. పంపిణీ చేశామంటున్న దాంట్లో రైతుల కంటే పక్కదారి పట్టిందే ఎక్కువని ఆరోపణలొస్తున్నాయి. ఒక్క ఉమ్మడి అనంతపురం మాత్రమే కాదు మిగతా రాయలసీమ జిల్లాల్లోనూ అక్కడక్కడ ఇలాంటి అక్రమాలు చోటు చేసుకున్నాయని సమాచారం.










