- విక్రయాలకు జెన్‌కోలకు కేంద్ర ఇఆర్‌సి అనుమతి
- డిస్కమ్‌లపై పెను భారం
- వినియోగదారులకు భారీ షాక్
న్యూఢిల్లీ : కరెంటు వాడకుండానే షాక్ కొట్టే రోజులు రానున్నాయి. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల ఒత్తిడికి లొంగి విద్యుత్ విక్రయాల రేటును భారీగా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇవ్వడమే దీనికి కారణం. ఫలితంగా డిస్కమ్‌లు భారీ మొత్తం ఖర్చు చేసి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రూ అప్ ఛార్జీల పేరుతోనో, మరో పేరుతోనో ఆ భారాన్ని అంతిమంగా ప్రజానీకంపై మోపుతున్న సంగతి తెలిసిందే ! కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (సిఇఆర్‌సి) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం యూనిట్ విద్యుత్‌ను 50 రూపాయలకు డిస్కమ్‌లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న 12 రూపాయల గరిష్టధర పరిమితిని ఎత్తివేసింది. 50 రూపాయల వరకు విక్రయించుకోవచ్చని ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్‌కు అనుమతిచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం గరిష్టంగా 12 రూపాయలకు యూనిట్ విద్యుత్ ను డిస్కామ్‌లు కొనుగోలు చేస్తున్నాయి. అదే సమయంలో నెలకు 30 యూనిట్లు లోపు కాల్చే నిరుపేద వినియోగదారులు యూనిట్‌కు రూ.1.90 చెల్లిస్తున్నారు. నెలకు 400 యూనిట్లు కాల్చే ఉన్నత మధ్యతరగతి, సంపన్నులు యూనిట్‌కు రూ.9.75 వంతున బిల్లు కడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే యూనిట్ విద్యుత్‌ను 50 రూపాయలకు కొనాల్సివస్తే వినియోగదారులకు బిల్లుల రూపంలో తగిలే షాక్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. దిగుమతి చేసుకునే బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్లతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టమ్స్‌లకు మాత్రమే 50 రూపాయల ధర వర్తిస్తుందని సిఇఆర్‌సి ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఆ పరిమితుల ప్రభావం పెద్దగా ఉండదని, డిస్కమ్‌లపై అపరిమిత భారం తప్పదన్న అంచనాలు వినపడుతున్నాయి. అదే జరిగితే వెంటనే కాకపోయినా, భవిష్యత్తులో ఆ మొత్తం వినియోగదారులపైకి డిస్కమ్‌లు బదిలీ చేసి తీరుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటా వేసవిలో విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈసారి వేసవికాలానికి ముందే సిఇఆర్‌సి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
డిస్కమ్‌లకు గత ఏడాదే కష్టాలు
నిజానికి అధిక ధరల కారణంగా గత ఏడాదే డిస్కమ్‌లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. గత వేసవిలో దేశ వ్యాప్తంగా విద్యుత్‌కు పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌లలో యూనిట్ ధర 20 రూపాయలు దాటింది. దీంతో దేశ వ్యాప్తంగా డిస్కమ్‌ల పరిస్థితి గందరగోళంగా మారింది. అంత డబ్చుపెట్టి కొనలేక కొన్ని రాష్ట్రాల డిస్కమ్‌లు చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఆ దశలో జోక్యం చేసుకున్న సిఇఆర్‌సి విద్యుత్ అమ్మకం ధర 12 రూపాయలకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా, ఆ ఆదేశాలను సవరించి యూనిట్ 50 రూపాయల వరకు విక్రయించుకోడానికి అనుమతిచ్చింది. 20 రూపాయలకు కొన్నప్పుడే డిస్కమ్‌లు సంక్షోభంలో చిక్కుకోగా తాజా నిర్ణయంతో వాటి పరిస్థితి ఏమవుతుందన్న చర్చ సాగుతోంది.
ప్రైవేటు ఒత్తిళ్లు...
యూనిట్ రేటును 12 రూపాయలకు పరిమితం చేసినప్పటి నుంచి ఆ ధర తమకు అనుకూలం కాదంటూ కొన్ని ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. తాము విదేశాల్లో అధిక ధరకు బొగ్గును కొంటున్నామని, తమ ఉత్పత్తి వ్యయంఅధికంగా ఉంటోందని ఆ సంస్థలు వాదించాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలు కూడా ఇదే విధమైన వాదన వినిపించాయి. అదానీ, రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ ప్రైవేటు లిమిటెడ్ (గతంలో ఎన్రాన్)తోపాటు మరికొన్ని సంస్థలు కూడా ఈ తరహా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ సంస్థ యూనిట్ ధరను 50 రూపాయలకు పెంచాలని సిఇఆర్‌సిని ఆశ్రయించింది. ఆ తరువాత 99 రూపాయలకు పెంచాలని కోరుతూ మరో పిటిషన్ వేసింది. వీటిపై విచారణ నిర్వహించిన సిఇఆర్‌సి తాజాగా 50 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
మన రాష్ట్రం సంగతేంటి ?
మన రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 227 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. దీనిలో 20 శాతం దాకా బయటనుండి కొంటున్నట్లు సమాచారం. వేసవి కాలంలో ఈ డిమాండ్ 235 నుండి 240 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా. గరిష్టంగా 250 మిలియన్ యూనిట్లకు కూడా చేరే అవకాశం ఉంది. అంటే, కనీసం 60 మిలియన్ యూనిట్లు ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌ల నుంచి కొనాల్సివస్తుంది. తొలుత గ్రీన్ విద్యుత్ (సోలార్, విండ్)ను విక్రయిస్తామని, ఆ తరువాత థర్మల్ విద్యుత్‌కోసం వేలం నిర్వహిస్తామని చెబుతున్నప్పటికీ ఆ ప్రత్యామ్నాయ విద్యుత్ లభ్యతకు అనేక పరిమితులు న్నాయి. వేసవికాలంలో అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ ఉండటంతో పోటీపడక తప్పనిస్థితి ఏర్పడుతుంది.










