Sep 05,2023 21:07

ప్రజాశక్తి-చెరుకుపల్లి (బాపట్ల జిల్లా) : తాము నక్సలైట్లమని ప్రముఖ వైద్యుడిని బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేసిన నిందితుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బాపట్ల జిల్లా చెరుకుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేపల్లె డిఎస్‌పి మురళీకృష్ణ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. చెరుకుపల్లి మండలం గుల్లాపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ ఈవూరి గణేష్‌ను బెదిరిస్తే డబ్బులు సులభంగా సంపాదించవచ్చునని కొంతమంది వ్యక్తులు పథకం వేశారు. తాము నక్సలైట్లమని,రూ.20 లక్షలు ఇవ్వాలని వైద్యుడికి ఫోన్‌ చేసి డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ ఫిర్యాదు మేరకు నిఘా ఉంచిన పోలీసులు.. నిందితులను చెరుకుపల్లి మండల పరిధిలోని కుంచాలవారిపాలెం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురు నిందితులకుగానూ నీలకంఠం వెంకటరమణ, పిట్టు శివారెడ్డి, షేక్‌ సుల్తాన్‌ భాష, పంది రాంబాబు, పోతర్లంక దుర్గారావును అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచారు. అనంతపురానికి చెందిన మరొక నిందితుడు రాజా రమేష్‌ పరారీలో ఉన్నట్లు డిఎస్‌పి తెలిపారు.