- మావోయిస్టుల వద్ద బందీలుగా తొమ్మిదిమంది
ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు 40 మందిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిలో 31 మందిని విడుదల చేశారు. మావోయిస్టుల చేతుల్లో ఇంకా తొమ్మిది మంది బందీలుగా ఉన్నారు. కిడ్నాప్ అయిన వారిలో పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.... పర్సేగఢ్ పోలీస్ స్టేషన్ పరిధి కుట్రూ అటవీ ప్రాంతంలోని చీకటిరాజ్ గుట్టలపై ఉన్న ఆదివాసీ వన దేవతలకు పూజలు చేసేందుకు సమీప ప్రాంతాల నుంచి 40 మంది వెళ్లారు. ఆ సమయంలో వారిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలిసి తమ వారిని వదిలేయాలని మావోయిస్టులను వారి కుటుంబసభ్యులు వేడుకున్నారు. ఈ నేపథ్యంలో కుట్రూ గ్రామ మాజీ సర్పంచ్ మహేష్ కుమార్ గోటా సహా తొమ్మిది మందిని మావోయిస్టులు తమ వద్ద ఉంచుకుని మిగిలిన వారిని విడిచిపెట్టారు. పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులు ఎందుకు కిడ్నాప్ చేశారు? వారి డిమాండ్లు ఏంటి? అనేది తెలిసిరాలేదు.










