- బిసి, ఎస్‌సి, కాపు, మైనార్టీ తరగతులకు పెనుదెబ్బ
- బ్యాంకు రుణాలతో పొందే ఉపాధికి గండి
- గత ప్రభుత్వాల హయాంలో లక్ష్యాలు నిర్ధేశించుకుని ముందుకు
- నేడు ఏఒక్క పథకమూ అమలు కాని దుస్థితి
- పథకాల సొమ్ము కార్పొరేషన్ జాబితాలో నమోదు
- వెనుకబడిన తరగతులకు కొరవడిన ఉపాధి భద్రత
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఉపాధి భద్రత కల్పించి వెన్నుదన్నుగా నిలిచిన బిసి, ఎస్‌సి, కాపు, మైనార్టీ కార్పొరేషన్లు నిర్వీర్యమయ్యాయి. దీంతో వివిధ తరగతుల ప్రజలకు బ్యాంకు రుణాలతో ఉపాధి మార్గం ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయా తరగతుల ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వాల హాయాంలో బిసి, ఎస్‌సి, మైనార్టీ కార్పొరేషన్లకు ప్రత్యేక స్థానం ఉండేది. 2014లో టిడిపి ప్రభుత్వం వచ్చాక కాపు కార్పొరేషన్‌ను సైతం ఏర్పాటు చేసింది. చదువుకుని ఉపాధి లేని నిరుద్యోగులకు కార్పొరేషన్లు అండగా నిలిచేవి. ప్రతియేటా లక్ష్యాలు నిర్ధేశించుకుని బిసి, ఎస్‌సి, మైనార్టీలకు బ్యాంకు రుణాలు ఇప్పించి ఉపాధి మార్గం చూపేవి. కిరాణా కొట్లు, ఫొటో స్టూడియోలు వంటి ఎన్నో వ్యాపారాలు పెట్టుకోవడంతోపాటు, కార్లు వంటివాటితో ఉపాధి పొందేందుకు కార్పొరేషన్లు సహాయ పడేవి. ప్రతి యూనిట్‌కూ రూ.లక్ష నుంచి రూ.పది లక్షలు వరకూ ఇచ్చిన పరిస్థితి కొనసాగేది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ రుణాలు పెద్దఎత్తున ఇచ్చిన పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన బిసి తరగతికి చెందిన కుటుంబాలకు బిసి కార్పొరేషన్ ద్వారా దాదాపు పది వేలకుపైగా యూనిjట్లు మంజూరయ్యాయి. కాపు కార్పొరేషన్ ద్వారా 15 వేల యూనిట్లు వరకూ ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా తొమ్మిది వేలకుపైగా యూనిట్లు ఇచ్చారు. నిరుద్యోగులు, చదువుకోనివారు సైతం కార్పొరేషన్ ద్వారా బ్యాంకు రుణాలు పొంది లబ్ధి పొందారు. తీసుకున్న రుణంలో సగం సబ్సిడీ కింద ప్రభుత్వం భరించేది. రూ.లక్ష రుణం ఇస్తే రూ.50 వేలు సబ్సిడీ వర్తించేది. తీసుకున్న రుణంలో సగం సొమ్ము సబ్సిడీ కింద పోవడంతో లబ్ధిదారులకు ఎంతగానో మేలు జరిగేది. బ్యాంకు రుణాలు పొందిన కుటుంబాలకు ఏదోక ఉపాధి మార్గం దొరికేది. ఉపాధికి సంబంధించిన యూనిట్ ఏర్పాటు చేస్తేనే కార్పొరేషన్ ద్వారా బ్యాంకు రుణాలు మంజూరయ్యేవి. దీంతో లబ్ధి పొందిన ప్రతి కుటుంబమూ ఏదోక యూనిట్‌ను తప్పకుండా ఏర్పాటు చేసేవి. యూనిట్ ఏర్పాటుతో వచ్చే ఆదాయంతో ప్రతినెలా బ్యాంకు వాయిదాలు చెల్లించుకునేవారు. ఎంతోమంది కార్లు పొంది వాటిద్వారా ఉపాధి పొందారు. కార్పొరేషన్ రుణాల కింద కార్లు పొంది ఇప్పటికీ ఉపాధి పొందుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి.
ఉత్సవ విగ్రహాలుగా కార్పొరేషన్లు
వైసిపి ప్రభుత్వం వచ్చాక బిసి, ఎస్‌సి, మైనార్టీ, కాపు కార్పొరేషన్లే కాకుండా, బిసి సామాజిక తరతగతుల్లో అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లను, డైరెక్టర్లను నియమించింది. అయితే నిధులు మాత్రం ఇవ్వలేదు. దీంతో ఛైర్మన్లుగా నియమితులైన వారు ఏం చేస్తున్నారో కూడా ఏఒక్కరికీ తెలియని పరిస్థితి ఉంది. కార్పొరేషన్ల పరిధిలో ఎటువంటి కార్యక్రమాలూ జరగడం లేదు. గతంలో రుణాల కోసం వచ్చే జనంతో కళకళలాడే కార్పొరేషన్లు నేడు వెలవెలబోతున్నాయి. పాత రుణాలకు సంబంధించిన వసూళ్లకు ఉద్యోగులు పరిమితమైన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అన్ని తరగతులకు ఇచ్చే సంక్షేమ పథకాల సొమ్మును బిసి, ఎస్‌సి, కాపు, మైనార్టీలకు ఇచ్చిన సొమ్ముగా చూపిస్తున్నారే తప్ప, ఉపాధి కల్పించే బ్యాంకు రుణాల గురించి మాత్రం ప్రభుత్వం మాట్లాడటం లేదు. కార్పొరేషన్ రుణాలు మంజూరు లేకపోవడంతో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. కార్పొరేషన్ రుణాలను పునరుద్ధరించాలని ఆయా తరగతుల ప్రజలంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.










