- రూ.2,900 కోట్లతో జాతీయ రహదారులకు శంకుస్థాపన
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంతి గడ్కరీ
ప్రజాశక్తి-తిరుపతి సిటి/ మదనపల్లె అర్బన్ (అన్నమయ్య జిల్లా) : తిరుపతిలో వరల్డ్‌క్లాస్ బస్‌స్టేషన్‌ను నిర్మించనున్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. తిరుపతి సెంట్రల్ బస్టాండుకు రాబోవు రోజుల్లో రోజుకు నాలుగు వేల బస్సులు, రెండు లక్షల మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని 30 ఎకరాల స్థలంలో రూ.500 కోట్లతో ఇంటర్‌నేషనల్ బస్‌స్టేషన్ నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు. తిరుపతి జిల్లాలో రూ.2,900 కోట్లతో నిర్మించనున్న జాతీయ రహదారులకు గురువారం గడ్కరీ శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుపతి తారకరామ స్టేడియం (ఎస్‌వియు మైదానం)లో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు మేజర్ పోర్టులను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. దేశంలోనే విశాఖపట్టణం పోర్టు మేజర్ పోర్టని, దాని అభివృద్ధి జరుగుతోందన్నారు. వీటి అనుసంధానికి రూ.50 వేల కోట్లతో 191 ప్రాజెక్టుల ద్వారా 3244 కిలోమీటర్ల పొడవున రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అంతకు ముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హదయాలయ ఆస్పత్రిని సందర్శించారు. టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హదయాలయ ఆస్పత్రిలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు ఉన్నాయని, ఇక్కడ నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం అభినందనీయమని తెలిపారు.
- ముంతాజ్ అలి సేవలు ఆదర్శనీయం : నితిన్ గడ్కరీ
నిరుపేద కుటుంబాలకు విద్య, వైద్యం అందించడంలో పద్మభూషణ్, సత్సంగ్ ఫౌండర్ శ్రీఎం (ముంతాజ్ అలి) ఆదర్శనీయమని నితిన్ గడ్కరీ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని నక్కలదిన్నెలో సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన 50 పడకల మల్టీ స్పెషాలిటీ స్వస్త్య ఆస్పత్రిని ఆయన గురువారం ప్రారంభించారు. ఆస్పత్రిలోని విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముంతాజ్ అలి ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాకుండా సంఘసంస్కర్త అని పేర్కొన్నారు. ముంతాజ్ అలి మాట్లాడుతూ మదనపల్లె పట్టణానికి తలమానికంగా, పేదలకు అందుబాటులో సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వస్త్య మల్టీ స్పెషాలిటీ ఆస్పటల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.










