Jul 13,2023 14:28
  •  పేదలకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు అభినందనీయం
  •  కేంద్ర మంత్రివర్యులు నితిన్‌ గడ్కరీ

ప్రజాశక్తి-తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు ఉన్నాయని, ఇక్కడ నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం అభినందనీయమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హదయాలయ ఆసుపత్రిని మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా నితిన్‌ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ గుండె, ఊపిరితిత్తులు తదితర అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చెన్నై, హైదరాబాద్‌ లాంటి పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఇవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవన్నారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటివరకు దాదాపు 1600 గుండె సంబంధిత శస్త్రచికిత్సలు ఉచితంగా చేశారని.. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్న టీటీడీ యాజమాన్యానికి, ఆసుపత్రి డాక్టర్లకు అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా అవయవమార్పిడికి సంబంధించిన డాక్టర్ల కొరత ఉందని, మరింత మందికి శిక్షణ అవసరమని చెప్పారు. ముందుగా ఆసుపత్రిలోని ఐసియు, ఔట్‌పేషెంట్‌ విభాగం, ఆపరేషన్‌ థియేటర్లు, వార్డులను గడ్కరీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆసుపత్రి డ్కెరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథరెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ భరత్‌ తదితరులు పాల్గొన్నారు.