ఒక పగలు, ఒక రాత్రి కలిపి ఒక రోజు అంటాం. రోజు నిడివి పెరుగుతుందా.. రోజులో మనకు వెలుగును పంచేది పగలు దినకరుడు, రాత్రి రేేరేడు. అదేనండీ.. చందమామ. ఇప్పుడంటే సెల్‌ఫోన్‌లు వచ్చాయి గానీ, మన చిన్నప్పుడు చందమామను చూపించే కదా అమ్మ గోరుముద్దలు తినిపించేదీ.. అయిపోయిన తర్వాత అమ్మ 'మామ'కు టాటాచెప్పించేది. అయితే అదే చందమామ ఇప్పుడు మనకు టాటా చెప్తోందట. ఔను. నిజమే. మన చంద్రుడు మనకు దూరదూరంగా జరిగిపోతున్నాడట. ఎందుకు అలా.. మామ అచ్చటా.. ముచ్చటా ఏమిటనేది తెలుసుకుందాం.
మనకు రోజుకి ఇరవై నాలుగు గంటలు..కొన్ని శతాబ్దాల క్రితం పదమూడు గంటలే..! అవును. సౌరవ్యవస్థ ఏర్పడిన ఐదు కోట్ల సంవత్సరాలకు చంద్రుడు ఆవిర్భవిం చాడు. భూశకలం ఒక రూపానికి రాక ముందే థీయా అనే ఖగోళ వస్తువు భూమి ని ఢకొీన్నది. అలా విరిగిన శకలాల నుంచి చంద్రుడు ఏర్పడినట్లు అధ్యయనాలున్నాయి. 900 మిలియన్ సంవత్సరాల క్రితం, భూమిపై అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండి చంద్రుడు భూమికి దగ్గరగా ఉండేదట.
- ఎంతెంత దూరం..!
అపోలో మిషన్ శాస్త్రవేత్తలు ఇటీవల చంద్రుడు భూమి నుంచి ఏడాదికి 3.8 సెం. మీ. దూరం వెళ్ళినట్లు, దీనితో రోజు సమ యంలో మార్పు వస్తోందని ధృవీకరించారు.
- ఎందుకిలా..?
'మహా సముద్రాలలో ఏర్పడే ఆటుపోట్ల కారణంగానే ఈ పరిణామాలు జరుగుతున్నా యని యూనివర్సిటీ ఆఫ్ లండన్, రాయల్ హాలోవేకి చెందిన జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ వాల్తామ్ అన్నారు.
వాటి వాటి కక్ష్యల్లో తిరిగేటప్పుడు, చంద్రుడి ఆకర్షణశక్తికి భూమిపై ఉన్న సముద్రాల్లో ఆటుపోట్లు కలుగుతాయి. భూమి వేగం చంద్రుని వేగం కంటే ఎక్కువ కావడంతో చంద్రుని ఆకర్షణశక్తికి మహా సముద్రాల్లో ఘర్షణలు ఏర్పడి, అలలు చంద్రు డి దిశగా ఎగసిపడతాయి. అదే సమయంలో భూమి గురుత్వాకర్షణవల్ల అవి తిరిగి కిందకు పడతాయి. ఇలా ఏర్పడే అలలు, ఆటుపోట్ల కారణంగా భూభ్రమణ వేగం తగ్గి, చంద్రుని వేగం పెరుగుతుంది. ఆ సమయంలో చంద్రుడు భూమి నుంచి కొంతదూరం జరుగుతాడని వివరించారు వాల్తామ్. ఇదే చర్య మిలియన్ ఏళ్ల క్రితమూ ఉంది. అయితే ఖండాలు వివిధరకాల స్థానాల్లో ఉండటంవల్ల ఆటుపోట్ల బలం అప్పటికప్పుడే తగ్గేదన్నారు.
- లూనార్ రెసిషన్
భూమికి చంద్రుడు 320 కోట్ల సంవత్సరాల క్రితం 2,70,000 కిలోమీటర్ల దూరంలో ఉండేవాడట. ప్రస్తుతం 3,84,400 కిలోమీటర్ల దూరం జరిగినట్లు ఇటీవలి ఓ అధ్యయనం. ఇలా చంద్రుడు భూమికి దూరంగా జరగడాన్నే 'లూనార్ రెసిషన్' అంటారు. దీని రేటు స్థిరంగా కొనసాగడం లేదని, కొన్నిసార్లు వేగంగా, కొన్ని సార్లు నెమ్మదిగా ఉందని వెల్లడైంది.
- రోజు నిడివి పెరుగుతోందా..?
అవును. ఇలా జరగటం వల్ల 24 గంటల కాలం కాస్త పెరుగుతోందట. చంద్రుడు పుట్టినప్పటి నుంచి లూనార్ రెసిషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 1600 సంవత్సరాల నాడు శతాబ్దానికి 1.09 మి.సె. మేర రోజు సమయం పెరిగింది. రానురాను శతాబ్దానికి 1.78 మి.సె. వరకూ ఈ పెరుగు దల ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. చంద్రుడు ఏర్పడినప్పుడు భూభ్రమణ వేగం ఎక్కువగా ఉండటం వల్ల 24 గంటల వ్యవధిలో రెండుసార్లు సూర్యోదయ, సూర్యాస్త మయాలు ఉండేవని జర్మన్ యూనివర్సిటీకి చెందిన జియోఫిజిస్ట్ టామ్ యూలెన్ఫెల్డ్ తెలిపారు.
- కాలానుగుణంగా..
'భూమి నుంచి చంద్రుని దూరం కాలానుగుణంగా మారుతోంది. భవిష్యత్‌లో కూడా ఈ మార్పు ఇలాగే కొనసాగుతుంది' అంటారు యూలెన్ఫీల్డ్. ప్రస్తుతం దూరానికి చేరుకోవటానికి 15 వేల కోట్ల ఏళ్లు పట్టింది. అయితే భూమిపై జరుగుతున్న పరిణామాల్ని బట్టి మన అంచనాకు మించి మూడింతలు ఈ ఆటుపోట్ల వేగం ఉండొచ్చని వాల్తామ్ అంటున్నారు.
- ఆర్టెమిస్ పయనంతో..
నాసా-ఆర్టెమిస్ వ్యోమనౌకలో చంద్రుని పైకి వెళ్తున్న వ్యోమగాములు, ఏభై ఏళ్ల నాటి కన్నా మరింత దూరం నుంచి భూమిని చూస్తారు. భూమి చుట్టూ ఉన్న చంద్రుని కక్ష్య ఈ దూరాన్ని నిర్ణయిస్తుంది. ఎలాగంటే చంద్రునికి సమీపంగా ఉన్న బిందువు, దూరంగా ఉన్న బిందువుల మధ్య దూరం ద్వారా నిర్ణయిస్తారు. అంటే రోజుకు కొన్ని పీకో సెకండ్ల (ఒక సెకండ్‌లో ట్రిలియన్ వంతు ) కాలం జతవుతుంది. ఈ దూరం ప్రతి 29 రోజులకు 43,000 కి.మీ. మారుతూ ఉంటుందని తేలింది.
- ఇదే అంతం కాదు..
మానవ తప్పిదాల వల్ల వాతావరణంలో మార్పులొచ్చి, మంచు కరగడంలాంటివీ రోజు వ్యవధి పెరగడానికి దోహదం చేస్తాయి. అట్లాంటిక్ మహాసముద్రం పరిణామం కారణమై ఉండొచ్చుననే అభిప్రాయమూ ఉంది. మంచు ఆటుపోట్లను తగ్గిస్తుందని వాల్తామ్ అన్నారు.
కొత్త అలల ప్రతిధ్వని ఇప్పటి నుంచి మళ్లీ 150 మిలియన్ ఏళ్లకు ఏర్పడి, 250 మిలియన్ ఏళ్లకు ఆగిపోవచ్చు. ఏదేమైన చంద్రుడు భూమిని పూర్తిగా విడిచిపెట్టడం జరగదు. ఒకవేళ అలా జరిగేట్లైతే, దానికి వెయ్యి కోట్ల ఏళ్ల ముందే సూర్యుడు క్షయం చెందుతాడు. అప్పటికే జీవరాశి నశించే అవకాశం ఉంటుంది.










