Oct 27,2023 21:50

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌:కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌ మీటర్‌ రీడర్లు బైక్‌ ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు చేపట్టిన బైక్‌ ర్యాలీని పెద్దపాడు వద్ద సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ కార్యాలయంలో సామూహిక రాయబారం నిర్వహించి ఎస్‌ఇకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎపి విద్యుత్‌ మీటర్‌ రీడర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రామకృష్ణ, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.శివారెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆర్‌.కుమారస్వామి, పి.తేజేశ్వరరావు మాట్లాడారు. విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న సుమారు 3,800 మంది విద్యుత్‌ మీటర్‌ రీడర్లకు శాశ్వత పరిష్కారం చూపాలని శ్రీకాకుళం, అనంతపురం, కడప జిల్లాల నుంచి ప్రారంభించిన బైక్‌ ర్యాలీలు ఈనెల 31న విజయవాడలో ముగుస్తాయన్నారు. పది నుంచి 20 ఏళ్లు పైబడి పనిచేస్తున్న మీటర్‌ రీడర్లకు పీసురేట్‌ పద్ధతిలో ఒక్కో కరెంట్‌ బిల్లుకు రూ.మూడు నుంచి రూ.నాలుగు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని విమర్శించారు. గతంలో స్పాట్‌ బిల్లింగ్‌ 24 రోజులు జరిగేదని, తర్వాత 12 రోజులు, ఆ తర్వాత తొమ్మిది రోజులకు కుదించి, తీవ్ర పనిభారం పెంచారని తెలిపారు. ఐటిఐ ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ డిప్లమో ఉత్తీర్ణులైన వారిని షిఫ్ట్‌ ఆపరేటర్లుగా నియమించాలని,నాన్‌ టెక్నికల్‌గా ఉన్న వారికి అర్హతను బట్టి విద్యుత్‌ సంస్థలో ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో విద్యుత్‌ మీటర్‌ రీడర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు జె.వేణుగోపాలరావు, పి.తులసీదాస్‌, డి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.