Oct 03,2022 13:47

ప్రజాశక్తి-ఒంటిమిట్ట (కడప) : వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్‌ మీటర్లు పెడితే తీవ్రస్థాయిలో అడ్డుకుంటామని ఏపీ రైతు సంఘం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి బి.దస్తగిరి రెడ్డి జిల్లా వ్యసాయ కార్మిక ఉపాధ్యక్షుడు కోనేటి నరసయ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఏపీ రైతు సంఘం ఒంటిమిట్ట మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నేతలు మాట్లాడుతూ ... వ్యవసాయ పంపుసెట్లకు రాష్ట్ర వ్యాప్తంగా మీటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేయడం రైతులకు నష్టందాయకమని చెప్పారు. రైతు సోదరులందరు దీన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయదారులకు ఇప్పటికే పెరిగిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు డిజల్‌ ధరలతో వ్యవసాయమే కష్టంగా మారిందని... ఈ సమయంలో పంపుసెట్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుల్లో పంపుసెట్లకు మీటర్లను అక్కడి ప్రభుత్వాలు వ్యతిరేకించాయని, ఎపిలో ప్రభుత్వం అంగీకరించడం దురదృష్టకరమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో దేశం మొత్తం విద్యుత్‌ పంపిణీని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ కూడా తీసుకొచ్చింది అని అన్నారు. ఈ సమయంలో విద్యుత్‌ మీటర్లు పెట్టడం ద్వారా భవిష్యత్తులో విద్యుత్‌ రంగం ప్రైవేటుపరం అయినప్పుడు కంపెనీ ఇష్టాలకు రైతాంగాన్ని బలి చేయడమే అవుతుందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని చెబుతున్నారని అలాంటప్పుడు మీటర్ల ఖర్చు ఎందుకని ప్రశ్నించారు. వ్యవసాయ పంపుసెట్లకు రాష్ట్ర వ్యాప్తంగా మీటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.