- రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ మీటర్లు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లపై కేంద్రం ద్వంద్వ విధానాలు పాటిస్తున్నట్లు తేలిపోతోంది. ఒకవైపు రాష్ట్రాల్లో వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటును వేగవంతం చేస్తూనే... మరోవైపు పార్టీ పరంగా ఎక్కడ చేస్తున్నామంటూ ప్రశ్నలు కురిపిస్తోంది. తాజాగా మూడు డిస్కామ్‌ల పరిధిలో భారీగానే మీటర్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో మీటర్లను సిద్ధం చేసేందుకు అనుమతిచ్చిన సంస్థకు నిధుల కేటాయింపుపైనా చర్చ జరుగుతోంది.
సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ మీటర్లను ఏర్పాటుచేస్తే కొంత అదనపు రుణాన్ని కూడా ఇచ్చేందుకు కేంద్రం ప్రతిపాదించింది. అయితే తాజాగా మీటర్లపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో బిజెపి నేతలు మాత్రం తమ ప్రభుత్వం విద్యుత్ మీటర్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 18,61,302 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు నిర్ణయించారు. ఇందులో ఎపిడిసిఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 2,61,302 మీటర్లు, సిపిడిసిఎల్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఐదు లక్షల మీటర్లు, ఎస్‌పిడిసిఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 11 లక్షల మీటర్లు బిగించేందుకు నిర్ణయించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,92,980 మీటర్లకు నిర్ణయించారు. మొత్తం ప్రాంతాల వారీగా చూస్తే అత్యధికంగా రాయలసీమలోనే ఎక్కువ మీటర్లకు రంగం సిద్ధం చేయడం విశేషం. మొత్తం మీటర్లలో సగానికిపైగా ఈ ఐదు జిల్లాల్లోనే ఉండడం గమనార్హం. తాజాగా జరిగిన ఒక భేటీలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు రాకపోతే విద్యుత్ మీటర్లద్వారా నేరుగా నగదు బదిలీ చేయవద్దని విద్యుత్ నియంత్రణ మండలి స్పష్టం చేయడం విశేషం. తమ నుంచి అనుమతి కూడా తీసుకున్న తరువాతే మీటర్లను బిగించేందుకు సంబంధిత కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించాలని చెప్పడం గమనార్హం.










