ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో అమలు జరుగుతున్న మౌలికాభివృద్ధి పనులపై నాబార్డ్ ఆరా తీస్తోంది. తాము అనేక రంగాల్లో అభివృద్ధికి రుణాలు ఇస్తున్నామని, వాటి పురోగతి వివరాలు సమర్పించాలని రాష్ట్ర అధికారులకు ఆ సంస్థ లేఖ రాసింది. ఈ లేఖతోపాటు ప్రత్యేకంగా ఒక నమూనాను కూడా పంపించి ఆ మేరకు వివరాలు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాబార్డ్ నుంచి వేల కోట్లు రుణాలుగా వస్తున్నాయి. ఇందులో వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, నీటిపారుదల వంటి అనేక రంగాల్లో మౌలికాభివృద్ధికోసం రుణాలను నాబార్డు ఇస్తోంది. అయితే అవి ఏవిధంగా ఖర్చు అవుతున్నాయన్న దానితో పాటు పనుల పురోగతి విషయంలోనూ ఎటువంటి స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2022-23 వరకు వివరాలు పంపాలని నాబార్డ్ కోరింది.
ఇదే సమయంలో గ్రామీణ మౌలికాభివృద్ధికి సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింపులు, వ్యయం చెప్పాలని, రోడ్లు కోసర ఎంత ఖర్చు చేశారు, వంతెనల పనులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మైక్రో ఇరిగేషన్ పనులు, భూసార పరిరక్షణ, వరద నివారణ, వాటర్‌షెడ్ పనులు, మార్కెట్ యార్డ్, గోదాముల నిర్వహణ, మార్కెటింగ్ మౌలికాభివృద్ధి, విత్తన విధానం, ఫిషింగ్ హార్బర్లు, జెట్టీల నిర్మాణ పనులతోపాటు, విద్యుత్ రంగానికి సంబంధించి సౌర, పవన విద్యుత్ రంగాల అభివృద్ధిపై తీసుకురటున్న చర్యలు, తాగునీటి వనరుల అభివృద్ధితోపాటు మరికొన్ని ఇతర రంగాల్లో చేపడుతున్న మౌలికాభివృద్ధి చర్యలను కూడా వివరించాలని నాబార్డ్ కోరింది.










