ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : భవిష్యత్తులో కూడా నాబార్డు ఇప్పుడు అందిస్తున్న విధంగానే తోడ్పాటును అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. నాబార్డు ఛైర్మన్ షాజి కెవి ప్రతినిధుల బృందం శనివారం క్యాంపు కార్యాలయంలో సిఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాబార్డు సహాయంతో రాష్ట్ర ఫ్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలుపై సమావేశంలో చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నాబార్డు సహాయంతో చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు నడుస్తున్నాయని నాబార్డు బృందానికి ముఖ్యమంత్రి తెలియజేశారు. నాబార్డు సహాయంతో చేపడుతున్న 'మన బడి నాడు - నేడు', కొత్త వైద్య కళాశాల నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగంలోనూ అనేక కార్యక్రమాలు సమర్ధవంతంగా కొనసాగుతున్నాయని నాబార్డ్ ఛైర్మన్ షాజి కెవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా చేపడుతోందని ప్రశంసించారు. మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కూడా జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయని తెలిపారు.










