Oct 14,2023 21:40

ప్రజాశక్తి-నెల్లూరు:కృష్ణపట్నం వద్ద ఫిషింగ్‌ జెట్టిని త్వరలోనే నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద రూ.20 వేల కోట్లతో మత్స్యరంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. నెల్లూరులోని వి.ఆర్‌.సి మైదానంలో సింహపురి సేంద్రియ మేళా (ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య ఉప ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం) రెండవ రోజు కార్యక్రమంలో ఆయన, రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గన్నారు. ముందుగా మేళాలో ఏర్పాటు చేసిన సేంద్రియ, మత్స్య ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, చిరుధాన్యాల స్టాళ్లను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడమే కాకుండా అత్యధికంగా నిధులు కేటాయిస్తోందన్నారు. అందులో భాగంగా రూ.2500కోట్లతో ప్రాజెక్టుల స్థాపనకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. వీటితోపాటు మరో రెండు ప్రాజెక్టులు స్థాపించేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపిలు బీద మస్తాన్‌ రావు, జివిఎల్‌ నరసింహారావు, మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు, ఆప్కాప్‌ చైర్మన్‌ అనిల్‌ బాబు, ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రోణంకి కూర్మనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.