Apr 02,2023 07:45

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సమీపంలో శుక్రవారం సాయంత్రం బిజెపి కాన్వారుపై రాయితో దాడి చేసిన వైసిపి కార్యకర్త దున్నా నితిన్‌ (23)ను అరెస్టు చేసి 41 ఎ కింద నోటీసు ఇచ్చామని జిల్లా ఎస్‌పి ఆరీఫ్‌ హఫీజ్‌ తెలిపారు. ఎస్‌పి తన కార్యాలయంలో మీడియాతో శనివారం మాట్లాడారు. అమరావతికి మద్దతుగా మందడంలో జరిగిన 1200వ రోజు సభలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి నిరసన తెలిపేందుకు బిజెపి కాన్వారుని వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు. వెనుక నాల్గో వాహనంపై నితిన్‌ రాయి విసిరాడని తెలిపారు. ఈ కాన్వారులో బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఉన్నట్టు తమకు తెలియదని చెప్పారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిపైనా కేసు నమోదు చేశామని ఎస్‌పి తెలిపారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై వైసిపి కార్యకర్తలు ఫిర్యాదు చేశారని ఆరీఫ్‌ హఫీజ్‌ చెప్పారు.