Oct 21,2020 22:42

beema

ప్రజాశక్తి-ఒంగోలుకలెక్టరేట్‌: పేదలకు భరోసా కల్పించేలా వైఎస్‌ఆర్‌ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టడం గొప్ప విషయమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రశంసించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. వైఎస్‌ఆర్‌ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీక్షణ సమావేశం ద్వారా బుధవారం ప్రారంభించారు. స్థానిక స్పందన హాలు నుంచి వీక్షణ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ అవినీతికి, లంచాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల కుటుంబాల బ్యాంకు ఖాతాలోకి 15 రోజులలోనే బీమా డబ్బులు జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ డబ్బు అందే లోపు చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం తక్షణమే రూ.10 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించటం అభినందనీయమన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు ఎవరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 
అసంఘటిత రంగ కార్మికులకు భద్రత 
వైఎస్‌ఆర్‌ బీమా పథకంతో అసంఘటిత రంగంలోని కార్మికుల కుటుంబాలకు భద్రత లభిస్తుందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. గతంలో మాదిరిగా ప్రీమియంలో 50 శాతాన్ని తాము భరించబోమని కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నా, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఈ పథకాన్ని అమలు చేయటం హర్షణీయమన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ వైఎసఆర్‌ బీమా పథకం పేద, బడుగు, బలహీనవర్గాలకు కొండంత అండగా ఉంటుందన్నారు. 
పేద కుటుంబాలకు ప్రయోజనకరం
పేద కుటుంబాలకు 100 శాతం ప్రయోజనకరంగా వైఎస్‌ఆర్‌ బీమా పథకాన్ని వర్తింప చేస్తామని కలెక్టర్‌ పోల భాస్కర్‌ తెలిపారు. జిల్లాలో 8 లక్షల 78 వేల 409 బియ్యం కార్డులు ఉండగా, వాటిలో 7 లక్షల 39 వేల 480 కుటుంబాలను ఈ పథకానికి అర్హులుగా ఇప్పటి వరకూ గుర్తించామని తెలిపారు. అర్హులు ఎవరైనా ఉంటే వారిని కూడా పథకం పరిధిలోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌(ఆసరా, సంక్షేమం) టి.బాపిరెడ్డి, డిఆర్‌డిఏ పీడీ ఎలీషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.