Aug 23,2023 08:15
  • గత రబీలో మెజార్టీ సంఖ్యలో ఒసిలు
  • వారిది 51.10 శాతం
  • ఒబిసిలు 41.53 శాతమే
  • కౌలు రైతులకు మొండిచెయ్యి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : గత రబీలో కేంద్ర పథకం ఫసల్‌ బీమాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాలో సామాజిక పొందిక ఉల్టాపల్టా అయింది. పంటలకు బీమా చేయించుకున్న రైతుల్లో జనరల్‌ కేటగిరి రైతుల శాతం అధికంగా కనిపిస్తోంది. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి.. ఈ మూడు కేటగిరీలు కలుపుకుంటే కూడా జనరల్‌ కేటగిరీ (ఒసి) రైతులే ఎక్కువగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లో ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్వంత జిల్లా వైఎస్‌ఆర్‌ కడపలో రాష్ట్రంలోనే ఎక్కువగా 76.26 శాతం మంది 'జనరల్‌' రైతులు ఉండటం విశేషం. 70 శాతానికిపైగా 'జనరల్‌' రైతులు కలిగిన జిల్లాలు తూర్పుగోదావరి (75.26 శాతం), ప్రకాశం (73.99 శాతం), పల్నాడు (71.79 శాతం). సాధారణంగా ఏజెన్సీ జిల్లాలైన అల్లూరి, మన్యం వంటి చోట్ల ఎస్‌టి రైతులు మెజార్టీ సంఖ్యలో ఉండటం కద్దు. తతిమ్మా జిల్లాల్లో బిసి జనాభా ఎక్కువుంటుంది. కానీ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో 'జనరల్‌' రైతులు అధికంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
 

                                                                            బిసిల కంటే ఎక్కువా ?

2022-23 రబీకిగాను 24 జిల్లాల్లో నోటిఫై చేసిన పంటలకు దిగుబడి ఆధారిత పంటల బీమా అమలు చేశారు. విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలను మినహాయించారు. బీమా కోసం 44.23 లక్షల దరఖాస్తులు రాగా 13.98 లక్షల మంది అర్హత పొందారు. పంటలు సాగు చేసిన 36.29 లక్షల ఎకరాలకు బీమా చేశారు. కాగా ఇన్సూరెన్స్‌ చేయించుకున్న రైతుల్లో జనరల్‌ కేటగిరీకి చెందిన వారిది 51.10 శాతం. తతిమ్మా అన్ని కేటగిరీల రైతులూ 48.90 శాతం. ఎస్‌సి 6.16 శాతం, ఎస్‌టి 1.21 శాతం, ఒబిసి 41.53 శాతం. జిల్లాలవారీగా ఎక్కువ తక్కువలున్నప్పటికీ ఎపిలో ఎస్‌సి జనాభా సుమారు 16 శాతం, ఎస్‌టి జనాభా 6 శాతం. ఇవి కూడా 2011 జనగణనకు చెందినవి. రాష్ట్ర విభజన ముందు నాటివి. బిసి కుల గణన చేపట్టకపోయినా జనాభాలో వారు 40-50 శాతం పైగానే ఉంటారు. జనరల్‌ కేటగిరీ జనాభా 30 శాతానికి ఎట్టి పరిస్థితు ల్లోనూ మించదు. క్రాప్‌ ఇన్సూరెన్స్‌లో జనరల్‌ కేటగిరీ రైతులు 50 శాతానికంటే ఎక్కువ ఉన్నారు. ఆలిండియా స్థాయిలో గత రబీలో పంటల బీమా చేయించుకున్న రైతుల్లో ఎస్‌సి 6.78 శాతం, ఎస్‌టి 5.35 శాతం, జనరల్‌ 32.47 శాతం కాగా ఒబిసి 55.40 శాతం. గత ఖరీఫ్‌లో మన దగ్గర కూడా సామాజిక పొందిక వాస్తవాలకు తగ్గట్టే ఉంది. ఎపిలో 2022-23 ఖరీఫ్‌లో పంటల బీమా చేయిం చుకున్న రైతుల్లో ఎస్‌సి 6.25 శాతం, ఎస్‌టి 8.68 శాతం, జనరల్‌ 27.51 శాతం, ఒబిసి 57.56 శాతం. రబీ దగ్గరకొచ్చేసరికి ఒబిసిల పర్సెంటేజి తగ్గింది.
 

                                                                              కౌల్దారులైనందునే...

ఎస్‌సి, ఎస్‌టి, బిసిలలో ఎక్కువగా కౌలు రైతులుంటారు. వారికి సరైన గుర్తింపు లేని కారణంగా, పంటలు సాగు చేసేది వారే అయినప్పటికీ బీమా మాత్రం భూయజమానుల పేరు మీద జరుగుతోందని, విపత్తుల వలన పంటలు నష్టపోతే వచ్చే అరకొర పరిహారం కూడా ల్యాండ్‌ ఓనర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటోంది. భూరికార్డులు, సాంకేతిక కారణాల వలన చాలా మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి రైతులు బీమాకు దూరమవుతున్నారు. ఇ-క్రాప్‌లో వారి పేర్లు ఎక్కట్లేదు. కేంద్రంతో కలిపి అమలు చేస్తున్న బీమా పథకంలో ఇ-క్రాప్‌ డేటాను కాకుండా బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న రైతుల డేటాను తీసుకుంటున్నారు. ఆ రీత్యా కౌలు రైతులు, బ్యాంక్‌ గుమ్మం తొక్కని కొత్త రైతులు బీమాకు దూరమవుతున్నారు.

22