May 18,2023 08:58
  • టెంట్లు, మెడికల్‌ కిట్లూ లేవు
  • ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నేతల ఎదుట ఉపాధి కార్మికుల ఆవేదన

ప్రజాశక్తి-యంత్రాంగం : పని ప్రదేశంలో పనిముట్లు, మెడికల్‌ కిట్లు, తాగునీరు, మజ్జిగ, ప్లే స్లిప్పులు ఇవ్వడంలేదని, పోయినేడు వేతనాలు ఇంతవరకూ చెల్లించలేదని, రోజుకు రూ.272 వేతనం రావడం లేదని, ఈ పనులు కూడా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల వద్ద ఉపాధి కార్మికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. చేతులకు బొబ్బలెక్కుతున్నాయని, కాళ్లకు ముళ్లు గీసుకుని గాయాలవుతున్నా టించర్‌ కూడా అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నేతలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం పర్యటించారు. ఉపాధి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని మెట్టూరు బిట్‌-3 ఇర్రపాడులో ఉపాధి కార్మికులతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం మాట్లాడారు. పని ప్రదేశంలో తాగునీరు, టెంట్లు ఇతర మౌలిక సదుపాయాలు లేవని ఆయన దృష్టికి వారు తీసుకొచ్చారు. ఎండ తీవ్రతకు రెండు పూటలా పనులు చేయడం కష్టంగా ఉందని చెప్పారు. గతంలో ఇచ్చిన వేసవి భృతి కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు ఈ నెల 25న కలెక్టరేట్‌ వద్ద చేపట్టే ధర్నాకు తరలిరావాలని కోరారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ఇటీవల విలీనం చేసిన గ్రామ పంచాయతీలు నేటికీ గ్రామీణ ప్రాంతాలుగానే ఉన్నాయని, ఉపాధి హామీ పథకం అమలు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పెద్దపాడులోని ఉపాధి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా జొన్నలగడ్డ, తాడికొండ మండలం లామ్‌లో వ్యకాస జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, సిఐటియు నాయకులు కె నళినికాంత, పెదకాకాని మండలం నంబూరులో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ఉపాధి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండిపోతున్న ఎండల్లో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడంలేదని కార్మికులు వాపోయారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామంలో ఉపాధి కార్మికులు మాట్లాడుతూ పని ప్రదేశంలో టెంట్‌గానీ, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ గానీ లేక ఇబ్బందులు పడుతున్నామని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.సుబ్బరాజు, నాయకులు జి.వెంకటేశ్వర్లు ఎదుట వాపోయారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం కె.నాగలాపురంలో ఉపాధి పనులను ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి.నారాయణ పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి పనుల వద్ద ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.