Dec 15,2020 13:24

పశ్చిమ గోదావరి (ఏలూరు) : రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని, అలాగే 2019 మోటార్‌ వాహన చట్టం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని వాహనాలను నడపాలని జిల్లా ఉప రవాణా కమిషనర్‌ సిరి ఆనంద్‌ తెలిపారు. 2019 మోటార్‌ వాహన చట్టంపై అవగాహన కోసం నగరంలోని వాహన డీలర్‌లు, రవాణా శాఖ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలోని హీరో మోటార్స్‌ నుండి ఫైర్‌ స్టేషన్‌ వరకు జిల్లా ఉప రవాణా కమిషనర్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ పోలీసులు, రవాణా సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు ఉండాలంటూ ప్లకార్డులతో ప్రదర్శన జరిపారు. హెల్మెట్‌ ధరించి వాహనాలు నడుపుతున్న వారికి ఉప రవాణా కమిషనర్‌ చాక్లెట్లను పంచారు. ఈ సందర్భంగా సిరి ఆనంద్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 2020 నవంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 397 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. రోడ్డు భద్రత లక్ష్యంగా ప్రతి ఒక్కరు వాహనాలను నడపాలని సూచించారు. కచ్చితంగా హెల్మెట్‌ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్టు ధరించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో యువత అధికంగా మృత్యువాత పడుతున్నారని, వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్య ధోరణి సరికాదని సూచించారు. ప్రతి ఒక్కరూ నూతనంగా ఏర్పాటు చేయబడ్డ మోటార్‌ వాహనాల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా అధికారి శ్రీధర్‌, రవాణా అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు, హీరో మోటార్స్‌ మేనేజర్‌ సోమేశ్వర రావు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.