- పల్నాడు జిల్లాలో తీవ్ర విషాద ఘటన
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రసవం నిమిత్తం భార్యను ఆస్పత్రులకు తిప్పిన భర్త... అప్పుడే జన్మించిన తన బిడ్డను చూడకుండానే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనకు సంబంధించి మృతుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం... పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన రామాంజినికి పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం రాత్రి పది గంటలకు ఆమెను కారంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ఆస్పత్రిలో సదుపాయాలు సరిగా లేవని గురజాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో, రాత్రి 11 గంటలకు గురజాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా సదుపాయాలు లేవని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సిఫారసు చేశారు. దీంతో, చేసేదేమీ లేక గర్భిణీని కుటుంబ సభ్యులు 70 కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దారి పొడవునా ఆమె మూడు గంటలుగా నరకయాతన అనుభవించారు. ఆస్పత్రిలో రామాంజిని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. గురజాల వరకూ భార్యకు తోడుగా వచ్చిన ఆమె భర్త ఆనంద్ (31) ఇంటికి వెళ్లి డబ్బులు తేవడానికి శుక్రవారం అర్ధరాత్రి బయలుదేరారు. బైక్‌పై కారంపూడిలోని ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో జూలకల్లు వద్ద రహదారిపై పెద్ద గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఆయనను నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికే చికిత్స కోసం తరలించారు. శనివారం తెల్లవారుజామున ఆస్పత్రి వద్దకు చేరగానే ఆనంద్ మృతి చెందారు. పుట్టిన బిడ్డను కనులారా చూడకుండానే కన్నుమూశాడని బంధువులు విలపించారు. భార్యను దగ్గరుండి చూసుకోవాల్సిన సమయంలో ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనంద్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు పిల్లలు అఖిల (9), అక్షయ(7), తరుణ్ (5) ఉన్నారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆనంద్ ఇటువంటి పరిస్థితిల్లో మృతి చెందడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య, పిల్లలు, బంధువుల రోదన చూపర్లను కంటతడి పెట్టించింది. అత్యవసర సమయంలో గర్భిణులకు సాధారణ కాన్పులు కూడా చేయలేని స్థితిలో కారంపూడి, గురజాల ఆస్పత్రులు ఉన్నాయని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.










