వాషింగ్టన్ : గతేడాది అమెరికా కాపిటల్ భవనంపై జరిగిన దాడిపై దర్యాప్తు జరిపిన కాంగ్రెస్ కమిటి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలని సోమవారం సిఫారసు చేసింది. గతేడాది జనవరి 6న క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిలో 100 మందికి పైగా గాయపడగా, నలుగురు పోలీస్ అధికారులు మరణించిన సంగతి తెలిసిందే. తిరుగుబాటు దారులకు సాయం చేయడం, పార్లమెంట్ కార్యాకలాపాలను అడ్డుకోవడం, అమెరికా ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు కుట్ర పన్నడం, తప్పుడు ప్రకటనలు చేయడం వంటి నాలుగు నేరారోపణలపై ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేయాలని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్యానెల్ న్యాయశాఖను కోరింది.
ట్రంప్‌పై అభియోగాలు మోపడానికి తమ విచారణ సమయంలో సేకరించిన సాక్ష్యాలు సరిపోతాయని నమ్ముతున్నట్లు ప్యానెల్ ప్రతినిధి జామీ రాస్కిన్ తెలిపారు. విచారణలో 1,000 కంటే ఎక్కువ సాక్షులను ఇంటర్వ్యూ చేసి, వేలాది డాక్యుమెంట్లను సేకరించిన తర్వాతే డెమెక్రాటిక్ నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ న్యాయశాఖకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం ఓ మాజీ అధ్యక్షుడిని కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో 2024 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి.










