న్యూఢిల్లీ : కర్ణాటక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నది. గత శనివారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డికె శివకుమార్ డిప్యూటీ సిఎంగా పదవీబాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో తొమ్మిది మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని.. కేబినెట్ మంత్రుల్లో దాదాపు అందరూ కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) తాజా నివేదికను కర్ణాటక ఎలక్షన్ వాచ్ బట్టబయలు చేసింది. ఇక తొమ్మిది మంత్రుల్లో నలుగురు మంత్రులపై (44 శాతం) తమపై తీవ్రమైన కేసులున్నాయని ప్రకటించుకున్నట్లు ఎడిఆర్ నివేదిక తెలిపింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సహా 10 మంది మంత్రుల్లో తొమ్మిది మంది ప్రమాణస్వీకారం చేసిన అఫిడవిట్‌ల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది. అయితే నివేదికను రూపొందించే సమయంలో.. ఇసిఐ (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) వెబ్‌సైట్‌లో కేజె జార్జ్ స్పష్టమైన, పూర్తి అఫడవిట్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల కేసును విశ్లేషించలేకపోయామని నివేదిక పేర్కొంది.
కాగా, సిద్ధరామయ్య మంత్రివర్గంలోని దాదాపుగా అందరూ కోటీశ్వరులేనని ఎడిబి నివేదిక పేర్కొంది. తొమ్మిది మంది మంత్రుల సగటు ఆస్తులు విలువ రూ. 229.27 కోట్లు ఉంటుందని ఎడిబి అంచనా వేసింది. ఈ మంత్రుల్లో ఉపముఖ్యమంత్రి అయిన డికె శివకుమార్ 1,413.80 కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతుడుగా ఉన్నాడని, ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే 6.83 కోట్ల ఆస్తులతో అత్పల్ప ధనవంతుడిగా ఉన్నాడని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇక మంత్రుల విద్యార్హతల విషయానికొస్తే.. ముగ్గురు మంత్రులు 8 నుంచి 12వ తరగతి మధ్య ఉత్తీర్ణత గలవారని, ఇక మిగతా ఆరుగురు మంత్రులు గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. ఇక మంత్రుల్లో ఐదుగురు మంత్రుల వయసు 41 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నారని, నలుగురు మంత్రులు 61 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్నట్లు ప్రకటించారని, కర్ణాటక కొత్త కేబినెట్ మహిళా మంత్రులు లేరని ఈ నివేదిక వెల్లడించింది.










