న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వ 'ఒకే దేశం ఒకే ఎన్నికలు (ఒఎన్‌ఒఇ)' ప్రచారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ విమర్శలు గుప్పించారు. ఆదివారం భువనేశ్వర్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలనే ఒకే ఒక లక్ష్యంతోనే మోడీ ప్రభుత్వం ఒఎన్‌ఒఇ ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చిందని అన్నారు. ఈ ఏడాది చివరలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, తెలంగాణ మరియు మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో ఒఎన్‌ఒఇ అమలు చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎందుకంటే మన వ్యవస్థలో ప్రభుత్వం మెజారిటీని కోల్పోయినా, నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందినా మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి వుంటుందని అన్నారు. అయితే ఒకే దేశం ఒకే ఎన్నికలు అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే.. రాష్ట్రపతి పాలన విధించాల్సి వుంటుందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ నుండి రాష్ట్రపతి పాలనకు మారుతున్నామని, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుందని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.
''నా దృష్టిలో ప్రభుత్వానికి దీని గురించి స్పష్టంగా తెలుసు. రాష్ట్రపతి పాలన విధించడానికి రాజ్యాంగంలోని అనేక సవరణలు అవసరమని కేంద్రానికి కూడా తెలుసు'' అని అన్నారు. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతామని భయపడుతోందని, అందుకే ఒఎన్‌ఒఇ పేరుతో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల వరకు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయబోతోందని అన్నారు. ఐదు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చని అన్నారు.










