అహ్మదాబాద్ : డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్‌లోని నరోడా అసెంబ్లీ స్థానానికి.. నరోడా పాటియా అల్లర్లలో నేరస్థుడిగా జీవితఖైదు అనుభవిస్తున్న మనోజ్ కుక్రాని కుమార్తె పాయల్ కుక్రాని(30)ని బిజెపి బరిలో నిలపనుంది. ఈమె ప్రస్తుతం అనస్తీషియా వైద్యురాలిగా పనిచేస్తోంది. 2002 గోద్రా అల్లర్లు జరిగిన ఒకరోజు తర్వాత అంటే ఫిబ్రవరి 28వ తేదీన నరోడా పాటియా ప్రాంతంలో ఊచకోత జరిగింది. అక్కడ మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని అల్లర్లు సృష్టించారు. ఈ అల్లర్లలో 97 మంది ముస్లింలు చంపబడ్డారు. ఈ అల్లర్ల కేసులోని 16 మంది దోషుల్లో మనోజ్ కుక్రాని కూడా ఒకరు. 2018లో కోర్టు అతనికి జీవితఖైదు శిక్షను విధించింది. అయితే ప్రస్తుతం అతను బెయిల్‌పై బయటే ఉండడం గమనార్హం.
పాయల్ కుక్రానీ తల్లి రేష్మా కుక్రానీ బిజెపి నేత.... స్థానిక కార్పొరేటర్. సింధీ వర్గానికి చెందిన కుక్రానీ కుటుంబమే స్థానికంగా ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రస్తుతం బిజెపి ఎమ్మెల్యే బలరామ్ తవానీకి మరోసారి అవకాశం ఇవ్వకుండా.. పాయల్‌కే బిజెపి సీట్ కన్‌ఫార్మ్ చేసింది. గతంలో మహిళా శిశుసంక్షేమ శాఖామంత్రిగా పనిచేసిన మాయా కొడ్నాని కూడా నరోడా పాటియా అల్లర్ల దోషుల్లో ఒకరు. అయితే 2018లో హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ఈమె మూడుసార్లు నరోడా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1990 నుంచి నరోడా అసెంబ్లీ స్థానాన్ని బిజెపినే కైవసం చేసుకుంది. ఆ తర్వాత 1998 నుంచి 2002 వరకు కొడ్నాని ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2002 నుంచి 2007 వరకు బిజెపినే గెలుపొందింది.
ఇక నరోడా పాటియా అల్లర్ల కేసులో 61 మంది నిందితులుగా గుర్తించారు. అయితే ప్రత్యేక సిట్ కోర్టు 2012 ఆగస్టులో 32 మందిని దోషులుగా నిర్థారించి, 29 మంది నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు అప్పీళ్లపై 2018 ఏప్రిల్‌లో అహ్మదాబాద్ హైకోర్టు 16 మందిని దోషులుగా నిర్థారించింది.










