Aug 14,2023 20:36

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులనూ అదానీకే కట్టబెడుతున్నారని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రిలయెన్స్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్రస్తుత రాజకీయాలు, ప్రభుత్వ తీరుపై ఆయన మాట్లాడారు. కేసులకు భయపడి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బిజెపికి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. టిడిపి, జనసేన పార్టీలు కూడా బిజెపికే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంలో చర్చ జరిగిన సందర్భంగా వైసిపి, టిడిపి ఎంపిలు మాట్లాడకపోవడం సిగ్గుచేటని అన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఎపి ప్రజల ఆత్మగౌరవాన్ని రాష్ట్ర ఎంపిలు బిజెపికి తాకట్టుపెట్టారని విమర్శించారు. బిజెపితో జనసేన కలిసి ఉంటే గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వస్తాయని పవన్‌కళ్యాణ్‌ను హెచ్చరించారు. బిజెపిని వీడితే పవన్‌ కళ్యాణ్‌కు జనం బ్రహ్మరథం పడతారన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలని హర్షకుమార్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మంత్రుల పేర్లు కూడా జనానికి తెలీవని ఎద్దేవా చేశారు. స్టేజిపై జగన్‌ ఒక్కరే కూర్చుంటారని, వైవి.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్టారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టారన్నారు. మణిపూర్‌ ఘటనకు బాధ్యత వహిస్తూ బిజెపి ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములనూ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మేస్తున్నారని ఆరోపించారు. వలంటీర్లు రూ.5 వేలతో కుటుంబాన్ని పోషించుకోగలరా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలని ప్రజలను కోరారు.