ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు బోగస్ అని వైసిపి ఆరోపించటంతో నిజం కాదని నిరూపించేందుకు పలుమార్లు ఏయు సెంటర్ కు వెళ్ళేందుకు గంటా శ్రీనివాసరావు ప్రయత్నించగా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఎప్పటికప్పుడు గంటాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్యే లతో వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను గంటా శ్రీనివాస్ రావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏయులో వున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూస్తే బాధ కలుగుతుందన్నారు. దీనిని డంపింగ్ యార్డ్ లాగా చేసారు. రాజకీయ కక్షతో ఈ సెంటర్ ను అభాసుపాలు చేసారని మండిపడ్డారు. ఇక్కడ కలిసిన చాలా మంది విద్యార్థులు ఈ సెంటర్ వల్ల మేలు జరిగిందని చెప్పడం ఆనందం కలుగుతుందని తెలిపారు. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ కావాలని దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో దాదాపు 13 జిల్లాలో 40 సెంటర్ లు ప్రారంభించడం జరిగింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు ఇండియాలోనే బెస్ట్ అని ప్రచారం చేసుకున్నారని తెలిపారు. కానీ ఇప్పుడు వైసిపి తన రాజకీయాలకు దీనిని బలి చేసిందన, తాను ఎన్నిసార్లు ఈ సెంటర్ సందర్శించేందుకు వద్దామన్నా పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహించారు. అందుకే ఆకస్మికంగా వచ్చామని తెలిపారు. వైసిపి ప్రభుత్వానికి ఏపిలో వున్న 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దేనీకైనా వెళ్ళతామని, అవీ బోగస్ అని నిరూపించగలరా అని సవాల్ చేశారు. చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి జైలు కు పంపారని చంద్రబాబు నాయుడు త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారనీ అన్నారు.










