Sep 04,2023 15:49

ఇంఫాల్‌ : మీడియా గొంతు నొక్కేందుకు బిజెపి నేతృత్వంలోని మణిపూర్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మణిపూర్‌ సిఎం ఎన్‌ బీరేన్‌సింగ్‌ ఆదేశాలతో ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఇజిఐ)కి చెందిన నిజ నిర్ధారణ బృందంపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని 66ఎ కింద ఇజిఐపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మీడియా స్వేచ్ఛ, ఎడిటోరియల్స్‌ నాయకత్వ ప్రమాణాలను పెంపొందించేందుకు 1978లో ఏర్పాటైన ఇజిఐ మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండపై ఆదివారం ఓ నివేదికను విడుదల చేసింది. బీరేన్‌సింగ్‌ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఇంఫాల్‌లో మీడియా మొత్తం మెయితీలకు అనుకూలంగా మారిందని పేర్కొంది. ఈ నివేదిక మరిన్ని హింసాత్మక పరిస్థితులకు దారితీసేలా ఉందని, ఇజిఐపై కేసు నమోదు చేయాలని బీరేన్‌ సింగ్‌ పోలీసులను ఆదేశించారు. ఐటి చట్టంలోని 66ఎను 2015లోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సెక్షన్‌ కింద పౌరులను హింసించడాన్ని నిలిపివేయాలని అన్ని రాష్ట్రాల పోలీసులను ఆదేశించినా, మణిపూర్‌ పోలీసులు అదే సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడం గమనార్హం.