Sep 23,2023 13:53

ఇంఫాల్‌ : మణిపూర్‌లో కుకీస్‌, మైతీస్‌కి మధ్య ఘర్షణలు చెలరేగాయి. మే 3వ తేదీన మొదలైన ఈ హింసాత్మక ఘర్షణల కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. గత కొన్ని నెలలుగా జరిగిన ఈ ఘర్షణల్లో దాదాపు 176 మందికి పైగా మృతి చెందారు. అలాగే వందలాది మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఘర్షణలు సద్దుమణిగాక ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించింది. శనివారం నుంచి మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ద్వేషపూరిత ప్రసంగాల వ్యాప్తి, అబద్ధపు ప్రచారాలను అరికట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం మే 3 నుంచి మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడడంతో ఈరోజు నుండి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌ ఇంటర్నెట్‌సేవలు పునరుద్ధరించబడతాయి.' అని ఆయన అన్నారు. అలాగే ఈ సందర్భంగా మణిపూర్‌కి అక్రమ వలసలు కొనసాగుతున్నాయని.. వీటిని అరికట్టేందుకు మణిపూర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో 60 కిలోమీటర్ల మేర కంచె వేయడానికి కేంద్ర హోంమంత్రిత్వశాఖ చర్యలు చేపట్టిందని బీరెన్‌ సింగ్‌ అన్నారు. గత ప్రభుత్వాల ప్రణాళికారహిత విధానాల వల్లే ఘర్షణలు చోటు చేసుకున్నాయని, ఇటీవల తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఘర్షణలు సద్దుమణిగాయని ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో బీరెన్‌ సింగ్‌ బంద్‌ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పోలీసు అధికారులపై దుర్భాలాషడటం వల్ల.. ప్రజలు సమస్యలు దారిమళ్లి.. మన మధ్య విబేధాలు సృష్టిస్తాయని బీరెన్‌ మండిపడ్డారు. గత రెండు నెలలుగా పరిస్థితి మెరుగుపడిందని.. ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించడంతో కాల్పుల ఘటనలు క్రమంగా తగ్గాయని బీరెన్‌ తెలిపారు.
మణిపూర్‌ యువత డ్రగ్స్‌ వాడకం పెరిగిందని దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తేలిందని బీరెన్‌ చెప్పారు. అందుకు తమ ప్రభుత్వం 2018లో 'వార్‌ ఆన్‌ డ్రగ్స్‌'ని ప్రారంభించింది అని అన్నారు. రాష్ట్రంలోకి చొరబడుతున్న అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడం, ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం, నల్లమందు సాగుకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడంపై దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా మణిపూర్‌ సిఎం బీరెన్‌ తెలిపారు.