అంధుల ఆరాధ్యుడు బ్రెయిలీ : కలెక్టర్
విజయనగరం : సర్ లూయిస్ బ్రెయిలీ అంధులపాలిట ఆరాధ్యుడని కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ కొనియాడారు. విజువల్లీ ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, విజువల్లీ ఛాలెంజెడ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక నాల్గొవ తరగతి ఉద్యోగుల సంఘ కార్యాలయంలో లూయిస్ బ్రెయిలీ 212వ జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముందుగా బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అంధులు ఇతరులకు దేనిలోనూ తీసిపోరని, ఇప్పటికే ఎంతో మంది నిరూపించారని అన్నారు. అంధుడు అయినప్పటికీ, ఐఎఎస్ సాధించి, జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ పొందుతున్న కట్టా సింహాచలం అందరికీ ఒక స్ఫూర్తిప్రదాతగా పేర్కొన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని, ఉన్నత స్థానాన్ని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అంధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం మాట్లాడుతూ లిపిని కనుగొనడం ద్వారా లూయిస్ బ్రెయిలీ చూపులేనివారికి మహౌపకారం చేశారని కొనియాడారు. అంధుల జీవితాల్లో వెలుగును నింపిన మహనీయుడని పేర్కొన్నారు. అంధులు తమలోని లోపాన్ని పక్కనబెట్టి, తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకో వాలని కోరారు. విజువల్లీ ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి.రవీంద్రబాబు మాట్లాడుతూ, అంధుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కషిని వివరించారు. వికలాంగుల హక్కుల చట్టం-2016 రూపొందడానికి కలెక్టర్ ఎంతగానో సహకరించారని చెప్పారు. అంధుల పట్ల సానుభూతి చూపించొద్దని, ప్రతి ఒక్కరూ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల్లో విజువల్లీ ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమాశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు జి.భాస్కర్రావు, ప్రధాన కార్యదర్శి రాము, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు వీరభద్రరావు, యూత్ అసోసియేషన్ నాయకులు ఓ.నర్సింగరావు, శ్రీనివాస్, జె.సతీష్, ఎల్.రత్నరాజు, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలభాస్కరరావు, నాల్గోతరగతి ఉద్యోగుల సంఘం పట్టణాధ్యక్షులు ఎం.గంగాప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.










