Oct 25,2023 20:03

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపిలే మద్యం తయారీ, సరఫరాలో ఉన్నారని, అమ్మకాల నుంచి వచ్చే సంపాదన దారి మళ్లిస్తూ వైసిపి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎపి స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌లో వందకు పైగా కంపెనీలు రిజిస్టర్‌ అయ్యాయని, వీటిలో 16 కంపెనీల ద్వారానే 74 శాతం మద్యం సేకరణ జరుగుతోందని అన్నారు. అదాన్‌ డిస్టలరీస్‌ వెనుక వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి, ఎస్‌పివై డిస్టలరీస్‌ వెనుక ఎంపి మిథున్‌రెడ్డి ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. అదాన్‌, ఎస్‌పివై సంస్థల అడ్రస్‌లు రెండూ హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లాలోని పాల్‌ డిస్టలరీస్‌కు రూ.931.32 కోట్లు మద్యానికి ఆర్డర్‌ ఇచ్చారని, ఈ కంపెనీని సిఎం జగన్‌ అనుచరులు బెదిరించి నడుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.56 వేలకోట్ల మద్యంపై ఆదాయం వస్తుంటే ప్రభుత్వం రూ.20 వేలకోట్ల ఆదాయం వస్తుందని చెప్పటాన్ని ఆమె తప్పుపట్టారు.