Sep 23,2023 15:15

ప్రజాశక్తి - కలెక్టరేట్‌, ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రాష్ట్రంలో నాణ్యతలేని, ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే మద్యాన్ని సరఫరా చేస్తున్నారని, తక్కువ ధర కలిగిన సరుకునే ఎక్కువ ధరకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డి.పురంధరేశ్వరి విమర్శించారు. విశాఖపట్నం జిల్లా కెజిహెచ్‌లోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డును ఆమె శనివారం సందర్శించారు. అక్కడ లివర్‌ సిరోసిస్‌ వ్యాధితో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. రోగుల పరిస్థితి విషమంగా ఉందని, వారిలో 39 మంది ఆల్కహాల్‌ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొంతమంది రోగులు చీప్‌ లిక్కర్‌ వల్ల తమ ఆరోగ్యం దెబ్బతిందని తన ఎదుట వాపోయారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి వివరించి, మద్యం నాణ్యతను ధ్రువీకరించాలని కోరుతానన్నారు. అనంతరం బిజెపి కార్యాలయంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుపై కేసు పెట్టిందని, ఆ కేసు విచారణ రాష్ట్రానికి సంబంధించిన సిఐడి చూస్తుందని, కేంద్రానికి ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. టిడిపి, బిజెపి కలిస్తే బాగుంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. 'మాది జాతీయ పార్టీ అని, పొత్తులపై నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుంది' అని తెలిపారు.