ప్రజాశక్తి-రాజవొమ్మంగి : పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కరించాలని, ఢిల్లీకి వెళ్లిన ఆదివాసీలు, జంతర్ మంతర్ వద్ద ధర్నా అనంతరం బుధవారం తిరిగి బయలుదేరారు. ఈనేపధ్యంలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తెల్లం రామకృష్ణ ఆధ్వర్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో వ్యవసాయ కార్మిక సంఘం,ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావులు మాట్లాడుతూ.. ఆదివాసీ బ్రతుకులు నేటికి అభివృద్ధికి నోచుకోగా పోగా ఇప్పుడు ఆదివాసీలను అడవి నుండి గెంటి వేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. అందుకోసమే నూతన అటవీ పాలసిని తీసుకొని వచ్చిందని, ఇదే అమలైతే ఆదివాసీలకు అడవిమీద హక్కు లేకుండా పోతుందన్నారు. భవిష్యత్తులో ఆదివాసులను అడవి నుండి గెంటయ్యబడతారని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో లక్ష కుటుంబాలు సర్వం త్యాగం చేస్తే నేటికీ పునరవాసం కల్పించకుండా గోదాట్లో ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో తెగల మధ్య చిచ్చుని, మతాల చిచ్చుగా బిజెపి మార్చి ఆదివాసీలను, ఆదివాసి మహిళలను మానభంగాలు హత్యలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రంలో జీవో నెంబర్ 3 రద్దు అయి చదువుకున్న యువత రోడ్డున పడ్డారన్నారు. ఈ ప్రభుత్వాలకు ఆదివాసుల అభివృద్ధి, చట్టాల మీద గౌరవం లేదన్నారు. ఇప్పటికైనా ఆదివాసి సమాజం మొత్తం ఉద్యమలోకి వస్తేనే హక్కులు కాపాడుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, పి నాగేశ్వరావు, సిరిమలిరెడ్డి, ఏ రవి, ఎమ్ వాణిశ్రీ, ప్రజాసంఘాల నాయకులు కె.సూరిబాబు, కె జగన్నాథం, ఎమ్ రమేష్, జె రాజు, టి శ్రీను, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.










