- ఇంట్లో పని ఉందని తీసుకెళ్లి దొంగతనం నేరం మోపి దాడి
- మరో ఇద్దరు మహిళల పట్ల వైసిపి కార్యకర్త పైశాచికత్వం
- ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు, నిందితుల అరెస్టు
ప్రజాశక్తి- మోపిదేవి, కలెక్టరేట్ (కృష్ణా) : గిరిజన బాలికను ఇంట్లో పని ఉందని పిలిచి దొంగతనం అంటగట్టి పశువును బాదినట్లు బాదాడు. ఆ బాలిక బంధువులైన ఇద్దరి మహిళలపైనా అమానుషంగా ప్రవర్తించాడు ఓ వైసిపి కార్యకర్త. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెం గ్రామంలో ఆలస్యంగా సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజులు బందీలుగానే ఉండి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీసిన బాధితుల కథనం ప్రకారం... కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త మత్తి రాజాచంద్ తన ఇంట్లో వేడుక ఉందని, కొద్ది రోజులు ఇంటి పని చేయాలని చెప్పి అదే గ్రామానికి చెందిన యానాది సామాజిక తరగతికి చెందిన బాలికను తీసుకెళ్లాడు. అయితే, ఇంట్లో బంగారు చెవి దిద్దులు పోయినట్లు దొంగతనం నెపం మోపి ఆ బాలికను దారుణంగా కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. తలకు కూడా తీవ్ర గాయమై రక్తం ఒళ్లంతా కారింది. ఆ బాలిక పిన్ని పద్మ, అమ్మమ్మ రమణలను కూడా పిలిపించి రాజాచంద్ కొట్టాడు. పోలీసు కేసు కాకుండా తప్పించుకోవడానికి... దొంగతనం చేసిన బంగారు ఆభరణాలు తమకు ఇచ్చినట్లుగా బలవంతంగా వారితో నేరాన్ని ఒప్పించి మోపిదేవి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. ఎటువంటి విచారణా చేయకుండానే రాజాచంద్ చెప్పింది విని ఎస్‌ఐ పద్మ వారి ముగ్గురినీ స్టేషన్లో తీవ్రంగా కొట్టారు. బాలిక తల నుంచి రక్తం కారుతున్నా పోలీసులుగానీ, రాజాచంద్‌గానీ కనీసం చికిత్స చేయించకుండా క్రూరంగా వ్యవహరించారు. ఆస్పత్రికి వెళితే ఇళ్లు తగలబెడతామంటూ రాజాచంద్ బెదిరించాడు. దిక్కుతోచని పరిస్థితిల్లో గాయాల నొప్పులు భరించలేక బాధితులు అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. 'వైద్యం మాత్రమే చేయండి... కేసు పెడితే మా దొర చంపేస్తారు' అంటూ ఆస్పత్రి బయటే ఉండి వేడుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవా గోవర్థన్ వారిని పరామర్శించి ఆస్పత్రిలో చేర్పించారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదుకు అవసరమైన ఎంఎల్‌సి రిపోర్టును ఆస్పత్రి వైద్యుల ద్వారా ఇప్పించారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డ డిఎస్‌పి మిగతా 2లో మురళీధర్ రంగంలోకి దిగి బాధితులను పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాధితులను మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు : రాష్ట్ర ఎస్‌టి కమిషన్ సభ్యులు శంకర్ నాయక్
గిరిజన బాలికపైనా, గిరిజన మహిళలపైనా దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్‌టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ తెలిపారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంగళవారం ఆయన రాష్ట్ర ఎస్‌సి కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్‌తో కలిసి పరామర్శించారు. దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రూ.50 వేలు తక్షణ పరిహారంగా మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వు కాపీలను బాధితులకు అందజేశారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో శంకర నాయక్ మీడియాతో మాట్లాడుతూ గిరిజన మహిళలపై దాడిని ఎస్‌టి కమిషన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. బాధిత బాలికకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని, మరో ఇద్దరు బాధితులకు స్థిరనివాసం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున పరిహారం కలెక్టర్ ద్వారా అందిస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం చేయడంలో అలసత్వం ప్రదర్శించడంతోపాటు వారిపై దాడి చేసిన ఎస్‌ఐపై, మహిళా కానిస్టేబుల్‌పై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్‌పిని కోరారు.
దాడి అమానుషం : కెవిపిఎస్
మచిలీపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కెవిపిఎస్ కృష్ణా జిల్లా అధ్యక్షులు సిహెచ్.రాజేష్, ఉపాధ్యక్షులు కొడాలి శర్మ, నగర అధ్యక్షులు ఎం.ఆనంద్ బెనర్జీ, నాయకులు బాబూరావు, ఐద్వా పట్టణ నాయకులు కొడాలి సుజాత, బూరా భవానీ, చీరువోలు విజయలక్ష్మి, పద్మ, సిఐటియు నాయకులు బూరా సుబ్రహ్మణ్యం, చిరువోలు జయరావు పరామర్శించారు. అనంతరం ఎస్‌టి కమిషన్ సభ్యులు శంకర్ నాయక్‌ను కలిసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.
ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు : జెసి డాక్టర్ అపరాజిత సింగ్
దాడి చేసిన వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజితసింగ్ తెలిపారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.










