Aug 27,2023 07:50
  • ఐదేళ్లుగా నాలుగు లక్షల మందికి పెండింగ్‌
  • సకాలంలో చెల్లించని టిడిపి ప్రభుత్వం
  • రెండు పర్యాయాలు వెరిఫికేషన్‌ చేసినా తేల్చని వైసిపి ప్రభుత్వం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : బూర్జ మండలం వావం పంచాయతీకి చెందిన వై.శాంతికుమారికి 2018లో ఇల్లు మంజూరైంది. ఎన్‌టిఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద అప్పటి ప్రభుత్వం రూ.రెండు లక్షలు ఇస్తామని చెప్పింది. మొదటి విడతగా రూ.70 వేలు అందించింది. తాను మరో రూ.2 లక్షలు అప్పు చేసి రూఫ్‌ లెవల్‌ వరకూ ఆమె ఇంటిని నిర్మించుకున్నారు. ఆ తర్వాత అప్పు పుట్టకపోవడం, బిల్లు అందకపోవడంతో ఇంటి నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపేశారు. చేసిన అప్పునకు నూటికి రూ.1.50 చొప్పున వడ్దీ ఇప్పటికీ కడుతూనే ఉన్నారు. ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు కళ్లు కాయలు కాసేలా ఆమె ఎదురుచూస్తున్నారు.
-ఇదే మండలం తుడ్డలికి చెందిన పి.ఆచారికి 2017లో ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. ఎన్‌టిఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద రూ.రెండు లక్షలు ఇస్తామని చెప్పడంతో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇల్లు మంజూరు కావడంతో ప్రభుత్వం ఎప్పటికైనా డబ్బులు ఇస్తుందన్న నమ్మకంతో అప్పు చేసి రూఫ్‌ లెవల్‌ వరకు నిర్మించాడు. ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడంతో స్లాబ్‌ వేసేందుకు డబ్బులు లేక రేకులతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు.
ఇంటి బిల్లులు రాక అప్పులు పాలైన పరిస్థితి వీరిద్దరికే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2017-19 కాలంలో ఎన్‌టిఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద సుమారు నాలుగు లక్షల మందికి గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 1.50 లక్షలు స్కీమ్‌ ఒకటి కాగా, మరొకటి రూ.రెండు లక్షల స్కీమ్‌. వాటిలో ఇళ్లు మంజూరై ఒక్క రూపాయి కూడా రాని వారూ, కొంతమేర డబ్బులు వచ్చిన వారూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇళ్లను పూర్తి చేయలేకపోయారు. పునాదుల స్థాయిలో కొన్ని, రూఫ్‌ లెవల్‌లో కొన్ని, ఆ తర్వాత స్థాయిలో కొన్ని ఇళ్లు నిల్చిపోయాయి. ఈలోగా ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, ఆ తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం డబ్బులు చెల్లించేందుకు తొలుత నిరాకరించడం వంటి సమస్యలతో లబ్ధిదారులకు అవస్థలే మిగిలాయి.

రెండు పర్యాయాలు వెరిఫికేషన్‌

టిడిపి హయాంలో మంజూరైన ఇళ్లకు బిల్లులు చెల్లించేందుకు తొలుత వైసిపి ప్రభుత్వం నిరాకరించింది. లబ్ధిదారుల నుంచి ఒత్తిళ్లు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకొని బిల్లులు చెల్లించేందుకు అంగీకరించింది. అయితే, టిడిపి ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను వెరిఫికేషన్‌ చేయాలని నిర్ణయించింది. అర్హులను గుర్తించేందుకు గతేడాది డిసెంబర్‌లో గృహ నిర్మాణ శాఖ సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో సర్వే చేయించింది. లబ్ధిదారులంతా అర్హులేనని అధికారులు నిర్ధారించారు. తాజాగా ఈ ఏడాది జూన్‌లోనూ మరోసారి పరిశీలించారు. అందులోనూ వారు అర్హులేనని తేల్చారు. దీనిపై ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందంటూ మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రకటనలు గుప్పిస్తున్నారు తప్ప, డబ్బులు రాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని, వెంటనే బిల్లులు మంజూరు చేయాలని వారు కోరారు.